3 March, 2026 | 2:38 AM

ఉదయం పరీక్ష.. సాయంత్రం ప్రసవం

03-03-2026 12:33 AM

తల్లయిన 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని

నాగర్‌కర్నూల్, మార్చి 2 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న ఓ 16 ఏళ్ల బాలిక కడుపునొప్పితో బాధపడుతూ తన తల్లితో పాటు జిల్లా కేంద్రం సంత బజార్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చింది.

అనుమానంతో జనరల్ ఆస్పత్రి పరిసరాల్లో ఉన్న ఓ ప్రైవేట్  స్కానింగ్ సెంటర్‌కి రెఫర్ రాశారు. స్కానింగ్ కొరకు పూర్తి వివరాలు నమోదు అనంతరం పురిటి నొప్పులు అధికం కావడంతో వెంట వచ్చిన తల్లి పక్కనే ఉన్న బాత్రూంలోకి తీసుకెళ్ళింది. బాత్రూంలో కొన్ని వింత శబ్దాలు వస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. అప్పటికే అప్పుడే పుట్టిన మగ బిడ్డను అక్కడే ఉన్న చెత్తబుట్టలో పడేసినట్లు గుర్తించారు.

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న భరోసా, శిశు సంరక్షణ సిబ్బంది పరిశీలించారు. సదరు బాలిక జిల్లాలోని ఓ కేజీబీవీ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ సోమవారం ఉదయం పరీక్షలు కూడా రాసినట్లు తెలిసింది.