3 March, 2026 | 7:39 AM

నిమ్జ్‌లో మౌలిక వసతుల కల్పనకు కసరత్తు

03-03-2026 12:35 AM

కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష సమావేశంలో పాల్గొన్న జగ్గారెడ్డి

సంగారెడ్డి, మార్చి 2(విజయక్రాంతి): నిమ్జ్ లో మౌలిక వసతులు కల్పించే ఎస్‌ఆర్‌అర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇప్పటివరకు సేకరించిన భూములను అప్పగించాలని కలెక్టర్ సూచించారు. సోమవారం ఆమె టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ లే అవుట్ అభివృద్ధి చేసేందుకు వీలుగా పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్నారు. లే అవుట్ ప్రకారం రోడ్లు, ఇతరత్ర మౌలిక వసతులు కల్పించేందుకు సేకరించిన భూముల్లో హద్దురాళ్ళను ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. గతంలోనే భూములు తీసుకుని రైతులకు నష్ట పరిహారం చెల్లించామని కానీ మొన్నటి వరకు ఆ భూముల్లో పనులు చేపట్టకపోవడంతో పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఇచ్చామని కలెక్టర్ వివరించారు.

ప్రస్తుతం అభివృద్ధి పనులు చేపట్టనుండటంతో ఇకపై పంటలు వేయకుండా చూడాలని, ఐదివరకే పంటలు వేసి ఉంటే కోతలు పూర్తయ్యే వరకు వేచి చూడాలన్నారు. సర్వేకు ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతియుత వాతావరణం లో నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సర్వే సందర్భంగా వేసిన హద్దు రాళ్ళను రైతులేవరూ తొలగించవద్దని, అలా చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశం లో అడిషనల్ కలెక్టర్ లు మాధురి, పాండు లతో పాటు టీజిఐఐసి జోనల్ మేనేజర్ విఠల్, జహీరాబాద్ ఆర్డీవో దేవుజా, నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి , తాహిల్దార్ లు పాల్గొన్నారు.