మక్క రైతులకు నిధులు విడుదల
- బ్యాంకు ఖాతాల్లో రూ.1,173 కోట్లు జమ
- మక్కజొన్న సేకరణలో చరిత్ర సృష్టించాం
- మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
హైదరాబాద్, మే27 (విజయక్రాంతి) : మక్క జొన్నలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,173 కోట్లు విడుదల చేసిందని, ఈ మొత్తాన్ని దాదాపు లక్ష మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. యాసంగి సీజన్‌లో 338 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 2.42 లక్షల మంది రైతుల నుంచి సుమారు 13.42 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
కొను గోళ్ల కోసం ఇప్పటికే రూ.3,757 కోట్లు ఖర్చు చేశామన్నారు. తెలంగాణ సర్కార్ రైతులకు అండగా నిలిచి మద్దతు ధరకు మక్కలు కొనుగోలు చేస్తుందన్నారు. మొత్తం భారాన్ని రాష్ట్రమే భరిస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 16 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగైందని, ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డు అని మంత్రి వెల్లడించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు.






