గడ్డం ప్రసాద్‌ను సీఎం చేయాలి
- దళితులపై ప్రేమను కాంగ్రెస్ నిరూపించుకోవాలి
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపు కేసులా?
- మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : దళితులపై కాంగ్రెస్(Congress)కు నిజంగా ప్రేమ ఉంటే గడ్డం ప్రసాద్‌కుమార్(Gaddam Prasad Kumar)ను వెంటనే ముఖ్యమంత్రిని చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Talasani Srinivas Yadav) సవాల్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కూడా కోరుతున్నానని చెప్పా రు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ఎప్పుడూ దళిత స్పీకర్‌గా చూడలేదని, ఆయనను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా గౌరవిస్తోందన్నారు. రాజకీయాల్లో స్పీకర్‌ను రెడ్డి, బీసీ, దళిత స్పీకర్ అంటూ వర్గీకరించడం ఎక్కడా లేదన్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులు(Chief Minister, Ministers) పదేపదే ‘దళిత స్పీకర్’ అని ప్రస్తావించడం వల్లే ప్రజలకు ఆ విషయం తెలిసిందని వ్యాఖ్యానించారు. గురువారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తలసాని మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపు కేసులు(Sexual harassment cases) పెట్టడంపై దారుణమని అన్నారు. అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల(BRS MLAs)పై ఇలాంటి కేసులు పెట్టడం ఎప్పుడూ చూడలేదన్నారు. తాను, ఎమ్మెల్సీ ఎల్.రమణ 1994 నుంచే ఎమ్మెల్యేలుగా ఉన్నామని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో తాను, రమణతో పాటు కొద్దిమందే ఉన్నారని పేర్కొన్నారు.
రాజకీయాల్లో ఇంతకాలం ఉన్న తనకు ఇలాంటి పరిణామాలు తొలిసారి కనిపిస్తున్నాయని అన్నారు. సెప్టెంబర్ 7న అసెంబ్లీ గేటు వద్ద భారీగా పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏముందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకునే క్రమంలో జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల గొంతు, చీర పట్టుకుని లాగారని ఆరోపిస్తూ ఈ ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ చనిపోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారని ఆరోపించిన తలసాని.. అలాంటి వ్యాఖ్యలపై అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టలేదని ప్రశ్నించారు. కేసీఆర్ మరణాన్ని కోరుతూ మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలను వరసలు పెట్టి పిలుచుకునే సంస్కారం ఉందని, కాంగ్రెస్ నేతలు ఉపయోగిస్తున్న బజారు భాష తెలంగాణ సంస్కారాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు. స్పీకర్‌పై తాతా మధు అనని మాటలను ఆపాదించి చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.
తాతా మధు ఆ మాటలు అన్న ట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ క్షమా పణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తాతలు, ముత్తాతలు సంపాదించిన భూము లను 22-ఏ జాబితాలో పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వైఫల్యంగా మారిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. తాను ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఇలాంటి రాజకీయాల ను ఎప్పుడూ చూడలేదని తలసాని అన్నారు.