15 July, 2026 | 7:10 AM

ఫిలిప్పున్స్‌పై గల్వాన్ తరహా దాడి

21-06-2024 01:47 AM

ఆ దేశ నేవీ పడవలపై చైనా దళాల దాష్టీకం

కత్తులు, గొడ్డళ్లతో బోట్లను ధ్వంసం చేసిన కోస్ట్‌గార్డులు

న్యూఢిల్లీ, జూన్ 20: పొరుగుదేశాలపై చైనా చేస్తున్న అరాచకాలు తారస్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఫిలిప్పున్స్ వాణిజ్య ఓడను అధీనంలోకి తీసుకున్న చైనా కోస్ట్‌గార్డ్ నౌక మరో దారుణానికి తెగబడింది. గల్వాన్ తరహాలో ఫిలిప్పీన్స్ దళాల పడవలపై చైనా కోస్ట్‌గార్డ్ బలగాలు కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో ధ్వంసం చేయడానికి యత్నించాయి. ఈ దాడి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. తమ నౌకాదళానికి చెందిన రెండు బోట్లు సెకండ్ థామస్ షోల్‌కు ఆహారం, ఇతర సామగ్రిని తరలిస్తుండగా చైనా దళాలు దాడి చేసినట్లు ఫిలిప్పీన్స్ అధికారులు తెలిపారు. ఫిలిప్పున్స్ దళాలతో తొలుత వాదనకు దిగిన చైనా దళాలు ఆ తర్వాత వారి బోట్లలోకి చొరబడి ఎం4 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నాయి.

నావిగేషన్ పరికరాలను సీజ్ చేశాయి. ఫిలిప్పున్స్ ఆర్మీ చీఫ్ జనరల్ రోమియో బ్రవ్నెర్ జూనియర్.. చైనా దళాలను సముద్రపు దొంగలతో పోల్చారు. తమ ఆయుధాలు, పరికరాలను తక్షణమే తిరిగి ఇవ్వాలని, నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు చైనా విదేశాంగ శాఖ ఈ ఘర్షణపై స్పందిస్తూ.. ఫిలిప్పున్స్ పడవల్లో అక్రమ ఆయుధాల సరఫరాను సమర్థంగా అడ్డుకున్నాయని, చట్టపరంగానే చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. ఆ దేశ సైనికులపై ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదని తెలిపింది. కోస్ట్‌గార్డ్ చట్టంలో సరికొత్త నిబంధనలను డ్రాగన్ దేశం గత శనివారం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జల సరిహద్దులను అతిక్రమించిన విదేశీయులను 30 నుంచి 60 రోజులపాటు నిర్బంధించే అవకాశం ఉంటుంది. ఈ చట్టాన్ని అవకాశంగా తీసుకుని చైనా కోస్ట్‌గార్డు సిబ్బంది ఇలాంటి దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలు తమవేనని, వాటి ఆధిపత్యం కోసం డ్రాగన్ దేశం ప్రయత్నిస్తోంది.