31 March, 2026 | 3:06 PM

వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు

31-03-2026 01:50 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో(Mailardevpally) కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాటేదాన్ పారిశ్రామికవాడలో ఎస్ఆర్ ఫుడ్ ప్రొడక్ష్సన్ పై హెచ్ ఫాస్ట్ పోలీసులు(H-FAST Police) దాడి చేశారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో అల్లం పేస్ట్ తయారు చేస్తున్న ఎస్ఆర్ ఫుడ్ ప్రాడక్ట్ యజమాని, ఆబిడ్స్ నివాసి అయిన 55 ఏళ్ల హసన్ అలీ రూపాణిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తనిఖీ సమయంలో, నిందితుడు అపరిశుభ్ర వాతావరణంలో, ప్లాస్టిక్ డబ్బాల్లో అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను తయారుచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఉత్పత్తిలో నాసిరకం ముడి పదార్థాలు, వెల్లుల్లి తొక్కలను వినియోగించడం జరిగింది. ఇది కల్తీ జరిగినట్లు సూచిస్తోంది. అంతేకాకుండా, నిందితుడు ఎసిటిక్ ఆమ్లం, గమ్ పౌడర్ వంటి పదార్థాలను కలుపుతున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రూ, 22 లక్షల విలువైన 4,032 కిలోల అల్లం, వెల్లుల్లి పేస్ట్, నాణ్యత లేని 6 వేల కిలోల వెల్లుల్లి , 210 కిలోల అల్లం వెల్లుల్లి పొట్టును స్వాధీనం చేసుకున్నారు. కల్తీ రాయుళ్ల ఆట కట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త టీమ్ ను ఏర్పాటు చేస్తాయని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.