2 August, 2026 | 1:02 PM

పోతన కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలుడు

02-08-2026 11:41 AM

 ఇద్దరు దంపతులకు తీవ్ర గాయాలు

గోదావరిఖని ఆగస్టు 02(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని(kamanpur mandal) పోతన కాలనీలో ఆదివారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడగా, ఇంట్లోని సామగ్రి పూర్తిగా ధ్వంసమైంది.

స్థానికుల వివరాల ప్రకారం, పోతన కాలనీలోని 83వ బ్లాక్, 1151 సింగరేణి క్వార్టర్‌లో నివసిస్తున్న దంపతులు ఉదయం ఇంటి పనుల్లో ఉండగా గ్యాస్ లీకేజీ కారణంగా ఒక్కసారిగా భారీ శబ్దంతో సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇంటి తలుపులు, కిటికీలు, ఫర్నిచర్, గృహోపకరణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

పేలుడు శబ్దం విన్న స్థానికులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గ్యాస్ లీకేజీ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.