2 August, 2026 | 11:34 AM

అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

02-08-2026 10:18 AM

డిసిపి రాజమహేంద్ర నాయక్ 

జనగామ, (విజయక్రాంతి): ఇటీవల లింగ నిర్ధారణ పరీక్ష చేసుకొని అక్రమ గర్భస్రావం చేయించుకొని  అంబాల శ్రావణి అనే యువతి మరణించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఈ ఘటన జరిగిన నుండి పోలీసులు వరంగల్ సిపి ఆదేశాల మేరకు వరంగల్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ  ఆధ్వర్యంలో జనగామ సిఐ సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో ముమ్మారంగా దర్యాప్తు చేపట్టారు. ఇట్టి విషయంపై శనివారం రోజున జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్, సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై రితీష్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో  డిసిపి మాట్లాడుతూ... అంబాల శ్రావణి అనే ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు కాగా మళ్లీ గర్భం దాల్చగా తన తల్లి మల్కాపురం శోభ ఆర్ఎంపి శ్రావణ్ ను సంప్రదించగా హన్మకొండ కు చెందిన ప్రవీణ్ తో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్ష చేయించి ఆడపిల్ల అని తెలియడంతో అనసూయ అనే ప్రైవేటు ఏఎన్ఎం వద్ద అబార్షన్ చేయించడం జరిగిందని దాని వలన శ్రావణికి ఎక్కువ కడుపునొప్పి రావడంతో జనగామ జయ హాస్పిటల్ లో చేర్చగా మెరుగైన వైద్యం కోసం ఉన్నత ఆస్పత్రిని సంప్రదించాలని వారు చూపించడం జరిగింది, దీనితో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స జరిపించారు.

అక్కడ పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించగా ఆరోగ్యం క్షీణించి మరణించినట్టు అక్కడి వైద్యులు తెలపడం జరిగింది, దీనితో తన భర్త అంబాల భాస్కర్  జనగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా   పోలీసులు కేసు నమోదు చేసి వరంగల్ సిపి శ్వేత, ఆదేశాల మేరకు  ఏసిపి భీమా శర్మ, పర్యవేక్షణలో జనగామ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, శుక్రవారం రోజున నమ్మదగిన సమాచారం మేరకు నిందితులను అదుపులో తీసుకొని విచారించగా వారు నేరం ఒప్పుకోవడంతో విలేకరుల సమావేశంలో హాజరు పరిచి  రిమాండ్ కు తరలించారు, నిందితులను పట్టుకోవడానికి ఇట్టి కేసులో ప్రతిభ కనబరిచిన జనగామ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ రెడ్డి ఎస్సై రితీష్,ఎస్సై భరత్, కానిస్టేబుల్ కర్ణాకర్,  సాగర్, కృష్ణ, భాస్కర్ల ను వరంగల్ సిపి అభినందించారు.