నేడే గట్లమల్యాల పీహెచ్‌సీ ప్రారంభం
నంగునూరు, మార్చి 21: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల ప్రజల కల నెరవేరబోతోంది. సుమారు రూ.2 కోట్లతో నిర్మించిన ఆరు పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హరీశ్‌రావు శంకుస్థాప చేసి, మెజారిటీ పనుల పూర్తి అయ్యాయి. ఆదివారం నర్మెట గ్రామంలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అదే వేదిక నుండి వర్చువల్ పద్ధతిలో గట్లమల్యాల పీహెచ్సీ ని కూడా ప్రారంభించనున్నారు.
భవనం సిద్ధంగా ఉన్నా, ప్రారంభోత్సవానికి నోచుకోక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ’విజయక్రాంతి’ దినపత్రిక నిరంతరం గళమెత్తింది. గట్లమల్యాలలో అటకెక్కిన వైద్య సేవలు‘, ‘దవాఖాన సిద్ధం.. అందని వైద్యం‘, ‘ప్రారంభానికి ఎదురుచూపులే!‘ వంటి శీర్షికలతో వరుస కథనాలను ప్రచురించి ప్రభుత్వంపై, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చింది. సబ్ సెంటర్లలో ఇరుకు గదుల మధ్య, సౌకర్యాలు లేక రోగులు, గర్భిణులు పడుతున్న నరకాన్ని కళ్లకు కట్టినట్లు వివరించడంతో జిల్లా యంత్రాంగం కదిలింది.
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ స్వయంగా గ్రామాన్ని సందర్శించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించడం, ’విజయక్రాంతి’ ప్రభావంతోనే సాధ్యమైందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూతన పీహెచ్‌సీ అందుబాటులోకి రావడంతో గట్లమల్యాలతో పాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు పది గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. గతంలో చిన్న చికిత్స కోసం కూడా కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేదని, ఇప్పుడు అధునాతన భవనంలో వైద్యం అందనుండటం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ’విజయక్రాంతి’కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.




