మాజీ ఎమ్మెల్సీ గీట్ల జనార్దన్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞశాలి
మంథనిలో గీట్ల జనార్ధన్ రెడ్డి 88వ జయంతి వేడుకల్లో ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న
మంథని, జూలై 10(విజయ క్రాంతి): మాజీ ఎమ్మెల్సీ మంథని మేధావి, కవి, రచయిత మరియు నిరంతర రాజకీయ పోరాటయోధుడు స్వర్గీయ గీట్ల జనార్ధన్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని మంత్రి మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న అన్నారు. గీట్ల జనార్దన్ రెడ్డి 88వ జయంతి వేడుకలు మంథని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి చైర్మన్ పలువురు ప్రముఖులతో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రగోతం రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ ఆకుల రాజ బాపు, విద్యార్థి జేఏసీ నాయకుడు బెజ్జంకి డిగంబర్ తదితరులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు.
ప్రజల హృదయాల్లో నిలిచిన గొప్ప వ్యక్తి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గీట్ల జనార్ధన్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన లాంటి మహోన్నత వ్యక్తి ఈ ప్రాంతంలో జన్మించడం మంథని ప్రజలందరికీ ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. నిత్యం ప్రజల శ్రేయస్సు కోసమే తపన పడుతూ, మంథని ప్రాంత సమగ్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషి అనన్య సామాన్యమైనదని గుర్తుచేసుకున్నారు. గీట్ల జనార్ధన్ రెడ్డి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడని, నేటి తరం నాయకులు, యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అభిమానులు మరియు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






