అమర్‌నాథ్ యాత్రలో విషాదం: నేపాల్ యాత్రికుడు మృతి
బనిహాల్/జమ్మూ: అమర్‌నాథ్(Amarnath Yatra) గుహాలయం నుంచి తిరుగు ప్రయాణంలో ఉండగా బనిహాల్ వద్ద తీవ్ర అనారోగ్యానికి గురైన నేపాల్‌కు చెందిన 61 ఏళ్ల యాత్రికుడు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరణించిన వ్యక్తిని కాఠ్‌మాండ్‌లోని మోహత్రికి చెందిన కృష్ణ దేవ్ ఠాకూర్‌గా గుర్తించారు. బల్తాల్ మార్గం గుండా తిరిగి వస్తుండగా బనిహాల్‌లోని నవయుగ సొరంగం సమీపంలో ఆయన స్పృహ తప్పి పడిపోయారని తెలిపారు. అతనిని లాంబర్ యాత్రా మైదానంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించి, అక్కడి నుంచి బనిహాల్‌లోని సబ్-డిస్ట్రిక్ట్ హాస్పిటల్ (SDH)కు రిఫర్ చేశారు. అనంతరం అతన్ని అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం మరణించినట్లు అధికారులు ప్రకటించారు.
గోడను ఢీకొట్టిన ఎర్టిగా కారు.. ఐదుగురు అమర్‌నాథ్ యాత్రికులకు గాయాలు
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై(Jammu-Srinagar National Highway) సమ్‌రోలి ప్రాంతంలోని తోల్దీ నల్లా వద్ద వాహన ప్రమాదానికి గురవడంతో ఐదుగురు అమర్‌నాథ్ యాత్రికులు గాయపడ్డారు. జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుండి పహల్గామ్‌కు బయలుదేరిన యాత్రికుల బృందంలో భాగంగా శుక్రవారం నాడు 'ఎర్టిగా' కారులో ప్రయాణిస్తుండగా, ఆ వాహనం అదుపు తప్పి జాతీయ రహదారి-44 గోడను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే, CRPF 137వ బెటాలియన్, గూర్ఖా 4/3, సివిల్ డిఫెన్స్, ట్రాఫిక్ పోలీస్, స్థానిక పోలీసు సిబ్బంది ప్రయాణికులను రక్షించేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన యాత్రికులను వెంటనే ఉధంపూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రికి తరలించారు.






