ఘాటి.. పేలడానికి సిద్ధంగా ఉన్నట్టనిపించే కథ
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఘాటి’. విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఆదివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. ‘ఘాటీ’ నా ఫస్ట్ తెలుగు సినిమా. అనుష్కకి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆమెతో కలిసి నటించడం చాలా ఆనందాన్నిచ్చింది‘ అని చెప్పారు.
డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ.. ‘కొన్ని కథలు చాలా సహజంగా, పచ్చిగా, పేలడానికి సిద్ధంగా ఉన్నట్టుంటాయి. ‘ఘాటి’ అలాంటి కథ. తూర్పు కనుమలు, ఆ పర్వత శ్రేణులు అక్కడ ఉన్న ఒక తీవ్రమైన భావోద్వేగాలు చాలా గట్టి మనుషులు గొప్ప మనస్తత్వాలు.. ఇవన్నీ కలగలిపి ఒక మంచి కథ చెప్పడానికి ఆస్కారం దొరికింది. చింతకింద శ్రీనివాసరావు గొప్ప రచయిత. మొదటిగా ఆయన నాకు ఈ ప్రపంచం గురించి చెప్పారు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది.
అరుంధతి, సరోజ, దేవసేన, భాగమతి.. ఇలా ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ అనుష్క చేసింది. స్వీటి ‘ఘాటి’లో శీలావతిగా మనందరి ముందుకు రాబో తుంది. అనుష్క విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం‘ అన్నారు. నిర్మాత రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఘాటి’లో అనుష్కని రియల్ క్వీన్ గా చూస్తారు. విక్రమ్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. చాలా అద్భుతమైన సినిమా చేశాం. ఈ సినిమాపై మేమందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అని తెలిపారు. నటులు జగపతిబాబు, చైతన్యరావు తదితర చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ చిత్రానికి నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందించారు.






