నగర ప్రగతికి 99 రోజుల ప్రణాళిక
ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
తొలి కార్పొరేషన్ సమావేశంలో 30 అభివృద్ధి అంశాలకు ఆమోదం
సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు రూ.500 కోట్ల చొప్పున బడ్జెట్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 2 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర అభివృ ద్ధిని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను పక్కాగా, ఫలితాలు కనిపించేలా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం లో ఆయన అధ్యక్షతన మొట్టమొదటి కార్పొరేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత స్టాండింగ్ కమిటీ తీర్మానించిన 30 కీలక అభివృద్ధి పనులకు కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
వారానికో థీమ్.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ
ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు మొత్తం 14 వారాల పాటు జరిగే ఈ ప్రగతి ప్రణాళికలో ప్రతి వారం ఒక ప్రత్యేక అంశం థీమ్‌పై దృష్టి సారించనున్నట్లు జయేష్ రంజన్ వెల్లడించారు. పారిశుద్ధ్యంతో ప్రారంభమై విద్య, వైద్యం, మహిళా సంక్షేమం, రైతులు, యువత, పర్యావరణం వంటి అంశాలపై ఈ కార్యక్రమాలు కొనసాగుతా యి.
తొలి వారం లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నగరంలోని చెత్త పాయింట్లను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లం ఘించి చెత్త వేసే వారిపై జరిమానాలు విధించాలని, చెరువులు, కుంటల్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, స్వయం సహాయక సం ఘాల సహకారంతో తొలగించాలని సూచించారు. యూత్ వీక్ లో భాగంగా యువతలో నైపుణ్యాభివృద్ధి, యాంటీ డ్రగ్ చైతన్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ విభజించే ప్రక్రియ తుది దశకు చేరుకుందని జయేష్ రంజన్ తెలిపారు. ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మరో రెండు రోజుల్లో నివేదిక అందజేస్తుందని వెల్లడించారు. కొత్తగా ఏర్పడే సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లకు ప్రాథమికంగా రూ. 500 కోట్ల చొప్పు న బడ్జెట్ కేటాయించినట్లు, ప్రస్తుతానికి జీహెచ్‌ఎంసీ జనరల్ ఫండ్ నుంచే వీటి ఆర్థిక నిర్వహణ జరుగుతుందని పేర్కొన్నారు.
సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్, అదనపు కమిషనర్‌లు సత్యనారాయణ, జోనల్ కమిషనర్‌లు కమిషనర్‌లు ప్రియాంక అల, మందా మకరందు, జి ముకుంద రెడ్డి, కేఏ మంగతాయారు, ఎస్ శ్రీనివాసరెడ్డి, చంద్రకళ, విజిలెన్స్ ఏఎస్పీ నరసింహరెడ్డి, చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, జ్యోతిర్మయి, సిసిపి కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




