జీహెచ్‌ఎంసీ ఆదాయం పెంపుపై కసరత్తు
నగర సుందరీకరణే లక్ష్యంగా సర్కార్ చర్యలు
బల్దియాలో ఇక నయా అడ్వర్టైజ్మెంట్ పాలసీ
కొత్త విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 4(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయాన్ని గణనీయంగా పెంచడంతో పాటు, నగర సుందరీకరణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీని తెరపైకి తెచ్చింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నూతన విధానానికి సర్కారు ఆమోదముద్ర వేయడంతో, దానికి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాల రూపకల్పనలో బల్దియా అధికారులు నిమగ్నమయ్యారు.
కేవలం అడ్వర్టైజ్మెంట్లకే పరిమితం కాకుండా.. నగరంలోని రోడ్లు, వీధి దీపాల నిర్వహణకు కూడా ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో త్వరలోనే గ్రేటర్ రూపురేఖలు మారనున్నాయి.ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో అనేక యూనిపోల్స్, హోర్డింగ్లు ఉన్నప్పటికీ, స్పష్టమైన విధానం లేకపోవడంతో అవి నిరుపయోగంగా ఉన్నాయి. వీటన్నింటినీ వినియోగంలోకి తెస్తూనే, నగర సౌందర్యం దెబ్బతినకుండా కొత్త పాలసీని రూపొందించారు. దీని ప్రకారం సిటీలోని అన్ని ప్రాంతాల్లో కాకుండా కేవలం వ్యాపార కేంద్రాలు,జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను మాత్రమే ఎంపిక చేసి, అక్కడ అడ్వర్టైజ్మెంట్లను అనుమతించనున్నారు.
ఈ కొత్త విధానం ప్రకారం ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసే హోర్డింగ్లు, యూనిపోల్స్‌ను ఇకపై బహిరంగ వేలం ద్వారా కేటాయిస్తారు. అలాగే ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేసే వాటి కోసం ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి, టెండర్ ప్రక్రియ ద్వారా అనుమతులు మంజూరు చేస్తారు. కమర్షియల్, సెమీ కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాలను బట్టి.. చదరపు అడుగుకు ఇంత అని రేట్లను నిర్ణయించనున్నారు.
ఈ కొత్త పాలసీలో కాలపరిమితికి సంబంధించి కీలక మార్పులు చేశారు. గతంలో హోర్డింగ్లు, యూనిపోల్స్‌ను ఏడాదికోసారి కేటాయించే పద్ధతి ఉండేది. కానీ త్వరలో అమల్లోకి రానున్న నిబంధనల ప్రకారం.. ఇకపై వీటిని ఏకంగా ఐదేళ్ల పాటు ఒకేసారి కేటాయించనున్నారు. లీజు దక్కించుకున్న సంస్థలు ఐదేళ్ల కాలానికి గాను, ఏడాది ఛార్జీని ముందుగానే జీహెచ్‌ఎంసీ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, మొత్తం ఏర్పాటు చేయనున్న అడ్వర్టైజ్మెంట్లలో దాదాపు పది శాతం స్థలాన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివద్ధి పనుల ప్రచారానికి ఉచితంగా కేటాయించాలనే నిబంధనను కూడా చేర్చారు.
ఈ మొత్తం వ్యవహారంలో నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ప్రభుత్వం స్పెషల్ సీఎస్‌కు కట్టబెట్టింది.మరోవైపు నగరంలోని రోడ్ల దుస్థితిని మార్చేందుకు కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ ఫేజ్-2కు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కోర్ అర్బన్ రీజియన్లో మొత్తం రూ. 3,145 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఇందులో దాదాపు 744.22 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్ల నిర్వహణ కోసం రూ. 2,230 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
అలాగే సీఆర్‌ఎంపీ ఫేజ్-1లో కవర్ కాని సుమారు 236.30 కిలోమీటర్ల బీటీ రోడ్ల కోసం రూ. 707 కోట్లు, అదనంగా 64.49 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల కన్వర్షన్ కోసం రూ. 208 కోట్లు కేటాయించారు.వీటితో పాటు నగరంలో వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను కూడా ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించేలా నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో ఉన్న సుమారు 7,60,591 వీధి దీపాలను పదేళ్ల పాటు నిర్వహించేందుకు రూ. 1,341.6 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.




