5 March, 2026 | 5:13 AM

సింగూర్ డ్యామ్ భద్రతకు అధిక ప్రాధాన్యం

05-03-2026 01:59 AM

స్వయంగా సందర్శిస్తా

భూసేకరణకు రూ. 5,000 కోట్లు

జూన్ 2 నాటికి భూసేకరణ పూర్తి

పాలెం వాగు ప్రాజెక్ట్ గేట్లు, రెగ్యులేటర్ సమస్యలను పరిష్కరిస్తా: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి) : సింగూర్ డ్యామ్ భద్ర త, ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరానికి ప్రాణాధారంగా నిలిచిన సింగూర్ ప్రాజెక్టు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటుందని తెలిపారు. స్వయంగా తాను సింగూర్ ప్రాజెక్టును సందర్శించి పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షిస్తానని వెల్లడించారు.

బుధవారం సహచర మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామిలతో కల సి సచివాలయంలో ఆయన నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో ఉన్న త స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. జంటనగరాలకు తాగునీటిని సరఫరా చేస్తూ, పరిసర ప్రాంతాలకు సాగునీరూ అందిస్తున్న సింగూర్ ప్రాజెక్టును పరిరక్షించడంతో పాటు  పునరుద్ధరణ విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

జాతీయ ఆనకట్ట భద్రతా సంస్థతో పాటు, రాష్ట్ర అధికారుల నుంచి భద్రతా పరిస్థితిపై హెచ్చరికలు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించేందుకు తక్షణ సాంకేతిక జోక్యాలు, నీటిమట్టం దిగువన అండర్వాటర్ పరిశీలనలు, మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూర్ డ్యామ్‌పై 2025 మధ్యకాలం నుంచే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

ఆ సమయంలో నిర్వహించిన అంచనాల్లో ఎంబార్క్‌మెంట్‌లో చీలికలు, స్లోప్ ఎరోషన్, రివెట్మెంట్ నష్టం, ప్లంజ్ పూల్ సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఇవి దిగువ ప్రాంతాల్లో వరద ముప్పుకు దారితీసే అవకాశాలపై ఆందోళనలు రేకెత్తించాయన్నారు. 29.91 టీఎంసీల స్థూల సామ ర్థ్యం గల ఈ రిజర్వాయర్ ప్రతీ సంవత్సరం హైదరాబాద్‌కు 67 టీఎంసీల నీటిని సరఫరా చేస్తోందని ఆయన తెలిపారు.

డ్యామ్ భద్రత విషయంలో పూర్తి బలోపేతం జరిగే వరకు అధిక ప్రమాదం కలిగించే ఆపరేషన్లు నిలిపివేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బండ్ దిగువన నీటి ని పూర్తిగా వదలకుండా దాగి ఉన్న నష్టాలను గుర్తించేందుకు సోనార్ పరీక్షలు మరియు అండర్వాటర్ సర్వేలు చేపట్టి 23 రోజుల్లో నివేదిక సమర్పించా లని అధికారులను ఆదేశించారు. త్వరలోనే స్వయంగా ఆనకట్టను సందర్శిస్తానని ప్రకటించిన ఆయన, ఒకే సీజన్‌లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు, పంటల విరామం రాకుండా చూడాలన్నా రు.

ఇదే సమయంలో సింగూర్ కాలువ లైనింగ్ పను ల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. మొత్తం 13 కి.మీ.లో 9 కి.మీ. పూర్తయ్యాయని, మిగిలిన 4 కి.మీ.ను అత్యవసరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. 2025 ఆగస్టులో నిల్వలను భద్ర పరిమితులకు కట్టడిచేసి, నియంత్రిత నీటి విడుదల ప్రారంభించినప్పుడు ఆనకట్టపై ముప్పు స్థాయి పెరిగిందని, డిసెం బర్ నాటికి దశలవారీగా నీటిమట్టాన్ని తగ్గించి ప్రధాన మరమ్మత్తులు చేపట్టినట్లు ఆయన వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు గాను అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,000 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. జూన్ 2వ తేదీ వరకు భూసేకరణ పూర్తి చేయాలని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ములుగు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి

ములుగు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని వేగంగా పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మం త్రి సీతక్క, వరంగల్ జిల్లా ఇంచార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. భూ సేకరణకు సంబంధించి 15 రోజుల్లో అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

నష్టపరిహారం వెంటనే చెల్లించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. బుధవారం సచివాలయంలో ములుగు జిల్లా పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర్‌తో పాటు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ములుగు జిల్లా ఇరిగేషన్ అధికారులు హాజర య్యారు. ములుగు జిల్లాలో సాగునీటి పనుల పురోగతి, పెండింగ్ అంశాలు, భూ సేకరణ సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ములుగు నియోజకవర్గ పరిధిలో 1,10,632 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని అధికారులు వివరించారు.

దేవాదుల, ఎస్సార్‌ఎస్పీ స్టేజ్ రామప్ప పాకాల లిఫ్ట్ ఇరిగేషన్, సమ్మక్క సారాలమ్మ ప్రాజెక్టు, పోట్లాపూర్ ఎత్తిపోతల, పాలేం వాగు ప్రాజెక్టు, మోడి కుంట వాగు, ఫ్లడ్ బ్యాంకులు తదితర పనుల స్థితిగతులపై మంత్రులు సమీక్షించారు. ములుగు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని వేగంగా పూర్తి చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. భూ సేకరణకు సంబంధించి పక్షం రోజుల్లో అంచనాలు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం వెంటనే చెల్లించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేస్తామని, అన్ని ప్రక్రియలు పూర్తుతై పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భూములు కోల్పో యే రైతులకు అమోదయోగ్యమైన మంచి ప్యాకేజీ అందించి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. స్వయంగా మంత్రులే రైతుల వద్దకు వెళ్లి భూ సేకరణ ప్రక్రియ చేపడతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం భూ సేకరణ, పరిహారం అంశాల్లో మొండి గా వ్యవహరించిందని విమర్శిస్తూ, తమ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని పేర్కొన్నారు.

రామప్ప లక్నవరం ఇంటర్ లింకింగ్ పనులకు అదనపు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం, ఇరిగేషన్ శాఖలు సమన్వయంతో పనిచేసి ములుగు రైతులకు త్వరితగతిన సాగునీరు అందించాలని ఆదేశించారు. దేవాదు ల ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణపై 15 రోజుల్లో మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపా రు. సమ్మక్క సారాలమ్మ ప్రాజెక్టు విషయంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని, అక్కడ ముంపు బాధితులకు తగిన పరిహారం చెల్లించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

పెండింగ్ పనుల జాప్యంపై కాంట్రాక్టర్లపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పనుల కొనసాగింపులో ఇబ్బం దులు ఉంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ములుగు జిల్లాలో సాగునీటి రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రు లు స్పష్టం చేశారు.

సాగు నీరు అందించడమే లక్ష్యం: -మంత్రి సీతక్క

అనంతరం మంత్రి సీతక్క తన ఛాంబర్లో ములుగు పరిధిలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల వేగవంతంపై అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన దిశానిర్దేశం చేశా రు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి వారం నివేదిక సమర్పించాలని ఆమె ఆదేశించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ములుగు తలాపున గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ, ఆ నీటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో రెండో పంటకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని స్పష్టం చేశారు.

ప్రతి వాగులో ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట చెక్డ్యామ్లు నిర్మించి సాగు మరియు తాగునీటి అవసరాలు తీర్చాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ములుగు రైతులకు సాగునీరు అందించలేకపోతే భవిష్యత్తులో మరింత కష్టతరమవుతుందని పేర్కొంటూ, ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన సాగునీటి పనులను సమయానికి పూర్తి చేసి ములుగును సస్యశ్యామలం చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు.