సీఎం నివాస ముట్టడి పిలుపు నేపథ్యంలో మోహన్ నాయక్ అరెస్ట్
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): గిరిజన సంఘాలు ఇచ్చిన సీఎం నివాస ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గిరిజన శక్తి మాజీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్‌ను మెల్లకుంట తండాలోని ఆయన నివాసంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మోహన్ నాయక్ మాట్లాడుతూ... రాష్ట్రంలో గిరిజనులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు.
గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.గిరిజన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.గిరిజనులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు.అక్రమ అరెస్టులతో గిరిజనులు, లంబాడీల పోరాటాలను అణచివేయలేరని ఆయన స్పష్టం చేశారు.సీఎం నివాస ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులను వినియోగిస్తోందని ఆరోపించారు. గిరిజన హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.






