30 April, 2026 | 4:05 AM

టెన్త్‌లోనూ బాలికలదే పైచేయి

30-04-2026 02:38 AM
  1. టెన్త్‌లో 95.15% ఉత్తీర్ణత
  2. గతంలో కంటే ఈసారి 2.37% ఎక్కువ
  3. ఫలితాల్లో ములుగు జిల్లా టాప్, హైదరాబాద్ జిల్లా లాస్ట్

ప్రైవేట్ కంటే రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యధిక ఉత్తీర్ణత 

ఇంగ్లిష్ మీడియంలోనే ఎక్కువ మంది పాస్

6 పాఠశాలల్లో సున్నా ఉత్తీర్ణత శాతం

జూన్ 5 నుంచి 12 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ 

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): పదో తరగతి ఫలితాలల్లో బాలికలే పైచేయి సాధించారు. మొత్తం 95.15 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 92.78 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈసారి 2.37 శాతం ఉత్తీర్ణత పెరిగింది. బాలురు 2,60,478 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,45,027 (94.07 శాతం) మంది పాసయ్యారు.

బాలికలు 2,56,337 మంది పరీక్షలకు హాజరు కాగా, అందు లో 2,46,747 (96.26 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 5,16,815 మందిలో 4,91,774 (95. 15 శాతం) మంది ఉత్తీర్ణత సాధించా రు. పదో తరగతి ఫలితాల్లో గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. 

 తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలల్లో అత్యధికంగా 99.1 శాతం మంది పాసయ్యారు. ఆతర్వాత బీసీ వెల్ఫేర్‌లో 98.99 శాతం, తెలంగాణ రెసిడెన్షియల్‌లో 98.64 శాతం, ట్రైబల్ వెల్ఫేర్-98.13 శాతం, మైనార్టీ-98.08 శాతం, కేజీబీవీ -98 శాతం, మోడల్-97.83 శాతం, ఆశ్రమ బడులు- 96.58 శాతం, ప్రైవేట్-95.81 శాతం, జెడ్పీ స్కూల్స్-93.53 శాతం, ఎయిడెడ్ స్కూళ్లలో 92.37 శాతం, ప్రభుత్వ స్కూళ్లలో 86.18 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

మేనెజ్మెంట్ల వారీగా.. అత్యధికంగా సోషల్ వెల్ఫే ర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం నమోదు కా గా, అత్యల్పంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు పాసయ్యారు. స్టేట్‌టాప్ స్కోర్ 597 గా ఉంది. బుధవారం బషీర్‌బాగ్‌లోని ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈ నవీన్ నికోల స్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి కలిసి పదోతరగతి ఫలితాలను విడుదలచేశారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఇక ప్రైవే ట్ (ఒకసారి ఫెయిల్ అయినవారు) విద్యార్థులు 9,351 మంది పరీక్షలకు హాజరుకా గా, వారిలో 5,538 మంది పాసయ్యారు. 

జూన్ 5 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు 

జూన్ 5 నుంచి 12 వరకు అడ్వానస్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు బుధవారం షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డైరెక్టర్ శ్రీహరి విడుదల చేశారు. ప్రతి రోజు ఉద యం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. సప్లమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు, రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఈనెల 30 నుంచి మే 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కుల రీకౌంటింగ్‌కు రూ. 500, రీవెరిఫికేషన్‌కు రూ. 1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

ఆ ఘనత టీచర్లదే: కేశవరావు

ప్రభుత్వ స్కూళ్లలో రికార్డుస్థాయి ఉత్తీర్ణత నమోదైందని ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు అన్నారు. తెలంగాణలో పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారంటే ఆ గొప్పతనం టీచర్లదే అన్నారు. క్లాస్ రూం కేవలం విద్యా బోధించే తరగతి  గదులే కాదు.. సోషల్ స్పేస్ అని పేర్కొన్నారు. విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చి దిద్దడంలో టీచర్లది కీలక పాత్ర అని తెలిపారు. ఉపాధ్యాయులు, పేరెంట్స్ కృషితోనే  విద్యార్థులు అత్యధికంగా ఫలితాలను సాధించారని చెప్పారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి ఫలితాలు వచ్చాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి  నేతృత్వంలోని  కాంగ్రెస్ ప్రభుత్వం  విద్యావృద్దికి ఎంతో కృషి చేస్తుందన్నారు. గత కొంతకాలంగా విద్యా వ్యవస్థపై దృష్టి సారించడంతోనే ఈ స్థాయిలో ఫలితాలు వచ్చాయని, అలాగే ఫెయిలైన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరో నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలుంటాయిని, అప్పుడు రాసి పాసవ్వాలని సూచించారు.

గణితంలో ఎక్కువ మంది ఫెయిల్..

పదో తరగతి ఫలితాల్లో ఈసారి కూడా గణి తం, సామాన్యశాస్త్రంలో ఎక్కువ మంది విద్యార్థు లు ఫెయిల్ అయ్యారు. గతణితం పరీక్షకు 5, 16,653 మంది హాజరవగా అందులో 5,03,541 (97.46 శాతం) మంది పాసయ్యారు. సామాన్యశాస్త్రం పరీక్షను 5,16,692 మంది రాయగా, 5,08,493 (98.41 శాతం) మంది పాసయ్యారు. 99.97 శాతంతో అత్యధికంగా ద్వితీయ భాషలో, 99.61 శాతంతో సాంఘిక శాస్త్రంలో, 99.98 శాతంతో తృతీయ భాషలో, 98.12 శాతంతో ప్రథమ భాషలో విద్యార్థులు పాసయ్యారు.

5,731 బడుల్లో 100%.. 

రాష్ట్రంలో మొత్తం పదో తరగతి పాఠశాలలు 11,677 ఉన్నాయి. అయితే వీటిలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు కలిపి 5,731 బడుల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. రాష్ట్రంలో 5149 ప్రైవేట్ పాఠశాలల్లో 2517 బడుల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 6 స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణత నమోదైంది. గతేడాదిలో 11,554 పాఠశాల లుండగా, అందులో 4,629 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఈసారి ఎయిడెడ్ స్కూళ్లు 141లో 36 స్కూళ్లు వంద శాతం, ఆశ్రం స్కూళ్లు 227 ఉంటే అందులో 124 స్కూళ్లు వంద శాతం, బీసీ వెల్ఫేర్ 291లో 197 వంద శాతం, ప్రభుత్వ బడులు 498లో 65 వంద శాతం, కేజీబీవీలు 475లో 290, మోడల్ 194లో 83, తెలం గాణ గురుకులాలు 36లో 23, మైనార్టీ గురుకులాలు 204లో 119, సోషల్ వెల్ఫేర్ 231లో 152, ట్రైబల్ 104లో 60, జెడ్పీ బడులు 4,127లో 2065 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇక ఇంగ్లీష్ మీడియంలో 95.86 శాతం ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు. తెలుగు మీడియంలో 89.14 శాతం మందే పాసయ్యారు.

ములుగు జిల్లా ఫస్ట్.. 

పదో తరగతి ఫలితాల్లో అత్యధికంగా ములు గు జిల్లాలో 99.30 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 89.23 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. నాగర్‌కర్నూల్ జిల్లా 99.03 శాతంతో రెండో స్థానం లో నిలవగా, 98.96 శాతంతో నిర్మల్ మూడో స్థా నం, 98.87 శాతంతో జగిత్యాల నాలుగో స్థానం, 98.81 శాతంతో మహబూబాబాద్ జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. 98.69 శాతంతో సంగారెడ్డి ఆరో స్థానంలో, 98.60 శాతంతో సూర్యాపేట ఏడో స్థానం, 98.57 శాతంతో కరీంనగర్ ఎనిమి దో స్థానం, 98.56 శాతంతో హన్మకొండ తొమ్మి దో స్థానం, 98.47 శాతంతో నల్లగొండ పదో స్థానంలో నిలిచాయి. 

మీడియం వారీగా ఉత్తీర్ణత శాతం

మీడియం హాజరైనవారు  పాసైనవారు శాతం

తెలుగు              44,686 39,831         89.14

ఇంగ్లీష్               4,64,589 4,45,376        95.86

ఉర్దూ               7192           6236         86.71

ఇతరులు                 348             331         95.11

మొత్తం              5,16,815 4,91,774        95.15

ఫలితాలు ఇలా (రెగ్యులర్)

                   బాలురు బాలికలు      మొత్తం

రాసినవారు 2,60,478         2,56,337      5,16,815

పాసైనవారు 2,45,027         2,46,747      4,91,774

శాతం           94.07         96.26        95.15