calender_icon.png 23 February, 2026 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డుల్లో తిరగండి.. సమస్యలు తీర్చండి

23-02-2026 12:14:18 AM

  1. మంత్రి పొంగులేటి

వారంలో ఐదు రోజులు.. రోజుకు రెండు గంటలు ప్రజల్లో ఉండాల్సిందే

ఏదులాపురాన్ని రాష్ట్రంలోనే ‘రోల్ మోడల్’గా తీర్చిదిద్దుతాం

కౌన్సిలర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దిశానిర్దేశం

మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనిత బాధ్యతలు స్వీకరణ

కూసుమంచి, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): ‘ఎన్నికల వరకే రాజకీయం.. గెలిచిన తర్వాత ఏ పార్టీ వారైనా ప్రజా ప్రభుత్వం తరపున పేదవాడికి సేవ చేయాల్సిందే. పదవి అనేది అధికారం కాదు, బాధ్యత అని గుర్తించాలి‘ అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పెద్దతండాలోని మున్సిపల్ కార్యాలయంలో ఏదులాపురం నూతన మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత బాధ్యతల స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఫీల్‌లో ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుంది

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి నూతన ప్రజాప్రతినిధులకు తనదైన శైలిలో దిశానిర్దేశం చేశారు. ప్రజలు నమ్మి ఓటేశారని, కేవలం కుర్చీలకే పరిమితం కాకుండా నిత్యం క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. ‘ప్రతి కౌన్సిలర్ వారంలో ఐదు రోజులు, ఉదయం పూట రెండు గంటలు తప్పనిసరిగా వార్డుల్లో పర్యటించాలి. ప్రతి పనికి నిధులు అవసరం లేదు, మీరు బాధ్యతగా తిరిగితేనే అధికారులు,

సిబ్బంది పనితీరు మెరుగుప డుతుంది‘ అని ఆదేశాలు జారీ చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతానని, తాగునీటి సమస్యలు, మురికినీరు నిలవకుండా చూడ టం, నాలాల కబ్జాలను అడ్డుకోవ డంపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, అప్పటికి ప్రతి వార్డు సమస్యపై కౌన్సిలర్లకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.

ఇందిరమ్మ ఇంటి వేడుకలో ఆత్మీయత

అనంతరం సత్యనారాయణపురంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడి గృహ ప్రవేశ వేడుకకు మంత్రి హాజరయ్యారు. నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపి, ఆత్మీయంగా పట్టు వస్త్రాలను కానుకగా అందించారు. పేదల సంక్షేమమే ఈ ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.