30 July, 2026 | 9:34 AM

కరీంనగర్ లో స్నేహితుడి ఇంట్లో రూ.26 లక్షల చోరీ కేసు ఛేదన

30-07-2026 08:57 AM

 మంథనికి చెందిన నిందితుడు శంకర్ లాల్ అరెస్ట్

 రూ. 17.60 లక్షల నగదు, కారు, ఫోన్ స్వాధీనం

కరీంనగర్, మంథని, జూలై 30(విజయక్రాంతి): చిన్ననాటి స్నేహితుడి ఇంట్లోనే పథకం ప్రకారం రూ. 26 లక్షల భారీ చోరీకి పాల్పడిన కేసును కరీంనగర్ రూరల్ పోలీసులు(Karimnagar Rural Police) ఛేదించారు. మంథని మండలం ఏక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు తగరం శంకర్ లాల్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ. 17.60 లక్షల నగదు, నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ కారు, ఒక శాంసంగ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నిందితురాలు అడెపు రేష్మ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. గుడిమల్ల శ్రీనివాస్ (డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్) మరియు నిందితుడు శంకర్ లాల్ చిన్ననాటి స్నేహితులు. శ్రీనివాస్ కరీంనగర్‌లోని తన అద్దె ఇంట్లో భారీగా నగదు దాచినట్లు తెలుసుకున్న శంకర్ లాల్, దాన్ని దొంగిలించేందుకు ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో రేష్మతో కలసి ఇంటి తాళాలు పగులగొట్టి, బాత్‌రూమ్‌లోని ప్లాస్టిక్ డ్రమ్‌లో దాచి ఉంచిన రూ. 26 లక్షల నగదును చోరీ చేశారు. దొంగిలించిన సొమ్ములో కొంత ఖర్చు చేయగా, మరికొంత మందికి ఇచ్చినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు.

సీసీటీవీ దృశ్యాలు, మొబైల్ సాంకేతిక విశ్లేషణ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు బొమ్మకల్ బస్‌స్టాప్ సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న రెండో నిందితురాలి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సిపి గౌస్ ఆలం ఆదేశాల మేరకు, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షణలో కేసును విజయవంతంగా ఛేదించిన రూరల్ ఇన్‌స్పెక్టర్ ఎ. నిరంజన్ రెడ్డి, ఎస్‌ఐ ఎ. లక్ష్మారెడ్డి మరియు వారి బృందాన్ని కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.