ఇండియా రేటింగ్ అవుట్‌లుక్ పెంపు
న్యూఢిల్లీ, మే 29: స్థిరమైన ఆర్థికాభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు, ద్రవ్య విధానాలు కొనసాగుతాయన్న అంచనాలతో భారత్ సార్వభౌమ రేటింగ్ అవుట్‌లుక్‌ను అంతర్జాతీయ రేటింగ్ ఏజన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ పెంచింది. 14 ఏండ్ల తర్వాత ఈ అవుట్‌లుక్‌ను (భవిష్యత్‌లో రేటింగ్ పెంచే అవకాశం) పెంచింది. ‘స్టేబుల్’ నుంచి ‘పాజిటివ్’కు అప్‌గ్రేడ్ చేసింది. దీనితో రెండేండ్లలో ఇండియా వాస్తవ రేటింగ్‌ను ఎస్ అండ్ పీ పెంచే ఛాన్స్ ఉన్నది. అయితే ప్రస్తుతానికి భారత్ సావరిన్ రేటింగ్‌ను ‘బీబీబీ’ వద్ద అట్టిపెట్టింది. ఈ ‘బీబీబీ’ రేటింగ్ కనిష్ఠ ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌ను సూచిస్తుంది.
అధికంగా ఉన్న ప్రభుత్వ రుణాన్ని, వడ్డీ భారాన్ని తగ్గించేలా భారత్ ఆర్థిక, ద్రవ్య విధానాలను అవలంబిస్తే వచ్చే 24 నెలల్లో రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయవచ్చని బుధవారం ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి భారీగా రూ.2.11 లక్షల కోట్ల డివిడెండు చెల్లించాలని రిజర్వ్‌బ్యాంక్ నిర్ణయం తీసుకున్న వారంరోజుల్లోనే రేటింగ్ అవుట్‌లుక్‌ను ఎస్ అండ్ పీ పెంచడం గమనార్హం. ఆర్బీఐ భారీ డివిడెండుతో ప్రభుత్వం ద్రవ్యలోటు తగ్గుతుంది. ఫారిన్, లోకల్ కరెన్సీ సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను ప్రస్తుత బీబీబీ లాంగ్‌టెర్మ్, ‘ఏ3’ షార్ట్ టెర్మ్ వద్ద అట్టిపెడుతున్నట్టు ఎస్ అండ్ పీ తెలిపింది.
ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా బేఫికర్
ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, ఆర్థిక సంస్కరణలు, ద్రవ్య విధానాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నామని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. ‘2024 జూన్ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా వచ్చే ప్రభుత్వం వృద్ధి వేగానికి మద్దతుగా ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తుందని, మౌలిక పెట్టుబడులను కొనసాగిస్తుందని, ద్రవ్య స్థిరత్వానికి కట్టుబడి ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం’ అని ఎస్ అండ్ పీ ప్రకటించింది. ఈ విధానాల అమలుతో ప్రభుత్వ రుణం, వడ్డీ భారం తగ్గి, వృద్ధిని మెరుగుపడుతుందని, ఫలితంగా వచ్చే 24 నెలల్లో రేటింగ్ అప్‌గ్రేడ్‌కు అవకాశం ఉంటుందని వెల్లడించింది. భారత్ ఆర్థికాభివృద్ధి జోరు, ప్రభుత్వ వ్యయాల్లో నాణ్యత మెరుగుదల, ద్రవ్య క్రమశిక్షణకు రాజకీయపరమైన కట్టుబాటు వంటి అంశాలతో భారత్ పరపతి సామర్థ్యాన్ని పెంచుతాయని తాము విశ్వసిస్తున్నట్టు రేటింగ్ ఏజెన్సీ వివరించింది.
మౌలిక రంగానికి అధిక కేటాయింపులు భేష్
ఈ ఏడాది వాస్తవ జీడీపీ వృద్ధి 6.8 శాతం మేర నమోదవుతుందని అంచనా వేసింది. గత మూడేండ్లలో భారత్ సగటున 8.1 శాతం వృద్ధి సాధించిందని, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇది అత్యధికమని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. వచ్చే మూడేండ్లలో సగటు వార్షిక వృద్ధి 7 శాతానికి సమీపంలో ఉంటుందని అంచనా వేసింది. ద్రవ్యలోటు అధికస్థాయిలో ఉన్నప్పటికీ, గరిష్ఠ వృద్ధి కారణంగా జీడీపీతో పోలిస్తే ప్రభుత్వ రుణం నిష్పత్తి తగ్గుతుందని పేర్కొంది. గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రంలోని నరేంద్ర మోది ప్రభుత్వం మౌలిక రంగానికి బడ్జెట్ కేటాయింపుల్ని పెంచుతున్నది. 2024 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయ కేటాయింపులు రూ.11 లక్షల కోట్లకు పెరిగాయి. ఇది జీడీపీలో 3.4 శాతం. దశాబ్దం క్రితం కేటాయింపులతో పోలిస్తే 4.5 రెట్లు ఎక్కువ. దీర్ఘకాలిక వృద్ధికి అడ్డుగా ఉన్న చెక్‌పాయింట్లు మౌలిక రంగం, కనెక్టివిటీ మెరుగుదలతో తొలగిపోతాయని ఎస్ అండ్ పీ పేర్కొంది.
ద్రవ్యలోటు, ప్రభుత్వ రుణం తగ్గితే రేటింగ్ పెంచుతాం
2025 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ (కేంద్రం, రాష్టాలు కలిపి) ద్రవ్యలోటు జీడీపీలో 7.9 శాతంగా ఉంటుందని, ఇది క్రమేపీ 2028 ఆర్థిక సంవత్సరానికల్లా 6.8 శాతానికి దిగివస్తుందని ఎస్ అండ్ పీ అంచనా వేసింది. ద్రవ్యలోటు అర్థవంతంగా తగ్గి, సాధారణ ప్రభుత్వ రుణం జీడీపీలో 7 శాతంలోపునకు దిగితే తాము రేటింగ్ పెంచుతామని తెలిపింది. కేంద్ర బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య విధానం సమర్థంగా అమలై, ద్రవ్యోల్బణం తక్కువస్థాయిలో కొనసాగినా తాము రేటింగ్స్ పెంచుతామని పేర్కొంది. ప్రభుత్వ వ్యయాల్లో అధికభాగం మౌలిక రంగానికి మళ్లుతున్నాయని, దీనితో దేశం అధిక వృద్ధిబాటలో పయనించేందుకు అడ్డంకులు తొలగిపోతాయాని ఎస్ అండ్ పీ పేర్కొంది. పటిష్టమైన ఆర్థిక ఫండమెంటల్స్ వచ్చే రెండు, మూడేండ్లలో వృద్ధి పరుగుకు దోహదపడతాయని తాము అంచనా వేస్తున్నామన్నది. కొవిడ్ 19 పాండమిక్ నుంచి భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా కోలుకున్నదని ఎస్ అండ్ పీ వివరించింది.






