తిరుమల శ్రీవారి సన్నిధిలో గోల్డ్ ఫ్యామిలీ
- 25 కిలోల బంగారం ధరించిన కుటుంబం
- వారికి సెక్యూరిటీగా 15 మంది సిబ్బంది
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): తిరుమలలో ముంబైకి చెందిన ఓ గోల్డ్ ఫ్యామిలీ శుక్రవారం హల్‌చల్ చేసింది. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించిన కుటుంబ శ్రీవారి దర్శనానికి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా వేల తులాల్లో బంగారం ధరించి వచ్చి స్వామివారికి మొక్కలు చెల్లించుకుంది ఈ కుటుంబం. వీరిలో ఇద్దరు 10 కిలోల చొప్పున, మరొకరు 5 కిలోల బంగారం ధరించారు. దాదాపు రూ.15 కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు.
దర్శనం అనంతరం బయటకు వచ్చిన ఆ గోల్డ్ ఫ్యామిలీని చూసి అక్కడున్న భక్తులు నోరెళ్లబెట్టారు. ఒక నగల దుకాణమే తరలి వచ్చిందా? అన్నట్టుగా ఆ ఫ్యామిలీ శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బంగారు నగలతో ధగధగా మెరిసిపోతున్న ఆ ఫ్యామిలీతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. వారి ఒంటిపై మాత్రమే కాదు.. వారు వచ్చిన కారు కూడా గోల్డ్ కోటే. దీంతో వాళ్లు కారెక్కి వెళ్లేంత వరకూ కనురెప్పలు మూయకుండా అలానే చూస్తూ ఉండిపోయారు భక్తులు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం విశేషం.






