మహారాష్ట్రవి కుల జైళ్లు
- అక్కడ కులాన్ని బట్టే విలువ
- నేరం చేయకున్నా పదేండ్లు జైలు
- ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా ఆవేదన
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 23 (విజయక్రాంతి): గ్రీన్ హంట్‌కు వ్యతిరేఖంగా పోరాడినందుకే తనను అక్రమంగా అరెస్ట్ చేసి జైళ్లో నిర్భందించారని మానవ హక్కలు కార్యకర్త, ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తెలిపారు. దేశంలో గ్యాంగ్‌స్టర్లకు సైతం బెయిల్ దొరుకుతుంది కానీ, మానవ హక్కుల కార్యకర్తలకు బెయిల్ దొరకటంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పదేళ్లపాటు నాగపూర్ జైల్లో ఉండి ఇటీవల విడుదలైన సాయిబాబాతో శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ‘మీట్ ది ప్రెస్ ’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గడ్చిరోలి పోలీసుల హింస, జైళ్లలో, న్యాయస్థానాల్లో పరిస్థితులపై సంచలన ఆరోపణలు చేశారు. కోర్టులో ఒక్కో ధర్మాసనం ఒక్కో విధంగా తీర్పులు ఇస్తున్నాయని ఆరోపించారు. తన కన్నతల్లి చనిపోతే శవాన్ని చూడటానికి కూడా పెరోల్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మహారాష్ర్ట జైళ్లు కులానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని, జైలుకు వచ్చే ఖైదీలకు కులాన్ని బట్టి సౌకర్యాల కల్పన ఉంటుందని ఆరోపించారు. కొత్తగా జైలుకు వచ్చిన వారిని గుట్టు చప్పుడు కాకుండా సీసీ కెమరాలు లేని ప్రాంతాల్లో ఉంచి చిత్ర హింసలకు గురిచేస్తారని, దీంతో ఆ నేరస్తుడికి జైలు అంటే భయం ఏర్పడుతుందని తెలిపారు.
‘నేను ఏ నేరం చేయలేదని మహారాష్ట్ర పోలీసులకు కూడా తెలుసు. నన్ను అరెస్టు చేసి జడ్జిముందు హాజరు పర్చినప్పుడు పోలీసు కస్టడికి ఇవ్వాలా? అని అడిగితే వద్దన్నారు. నేరుగా జైలుకు పంపించాలని కోరారు. దీనిని బట్టి నేను ఏ నేరం చేయలేదన్న విషయం పోలీసులు జడ్జి ముందే అంగీకరించారు. పోలీసులు నా వీల్‌చైర్‌ను ధ్వంసం చేసి చిత్ర హింసలు పెట్టిన తరువాత జైలుకు తరలించారు.
తొమ్మిది నెలలు హాస్పిటల్‌కు కూడా తీసుకెళ్లలేదు. పదేళ్ల జైలు జీవితంలో 21 రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. ఎన్ని నిర్బంధాలు విధించినా తెలంగాణ సాధన ఉద్యమ అడుగు నా ఊపిరిలో సజీవంగానే ఉంది’ అని చెప్పారు. ప్రొఫెసర్ హరగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే అధ్యక్షులు కే విరాహత్ అలి, రాష్ట్ర కార్యదర్శి వీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.






