బంగారం కొత్త రికార్డు
రూ.74,000 దాటేసిన ధర
హైదరాబాద్, ఏప్రిల్ 16: కొనసాగుతున్న మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో బంగారం ఏ రోజుకారోజు కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు పుత్తడి ఫ్యూచర్ ధర భారీగా పెరగడం, డాలరు మారకంలో రూపాయి విలువ క్షీణించిన ఫలితంగా దేశీయ మార్కెట్లో పుత్తడి ధర కొత్త రికార్డుస్థాయికి చేరింది. హైదరాబాద్ స్పాట్ 24 క్యారెట్ల ధర తొలిసారిగా రూ.74,000 స్థాయిని అధిగమించింది. 10 గ్రాముల ధర ఒక్క ఉదుటన రూ.980 పెరిగి రూ. 74,130 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 తులం ధర రూ. 900 పెరిగి రూ. 67,950 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పుత్తడి ధర 25 డాలర్ల మేర పెరిగి 2,390 డాలర్లకు చేరింది.
రూపాయి ఎఫెక్ట్
వాస్తవానికి ప్రపంచ మార్కెట్లో పుత్తడి గతవారంలో సృష్టించిన 2,448 డాలర్ల రికార్డుస్థాయికి దిగువనే ట్రేడవుతున్నప్పటికీ, డాలరు మారకంలో రూపాయి విలువ ఈ వారం రోజుల్లో భారీగా పతనమైన ఫలితంగా దేశీయ మార్కెట్లో బంగారం ధర కొత్త రికార్డుస్థాయికి చేరింది. వారం రోజుల క్రితం 83.20 సమీపంలో ఉన్న రూపాయి విలువ తాజాగా 83.60 స్థాయికి పడిపోయింది.






