22-10-2025 02:15:39 AM
హైదరాబాద్, అక్టోబర్ 21(విజయక్రాంతి): బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. మంగళవారం ఒక్కరోజే తులం పసిడిపై ఏకంగా రూ.మూడు వేల వరకు పెరిగి కొనుగోలుదారులకు భారీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.34 లక్షల మార్కును దాటేసింది. బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెట్టడంతో పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలు చేయాలనుకునే వారిలో ఆందోళన మొదలైంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం, సోమవారం రూ.1,31,600గా ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర, మంగళవారం నాటికి రూ.1,34,500కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా తులంపై రూ.1,21,000 పలుకుతోంది. ఇక వెండి ధరలోనూ భారీ పెరుగుదల కనిపించింది. సోమ వారం కేజీ వెండి రూ.1,67,300 ఉండగా, మంగళవారం రూ.నాలుగు వేలకు పైగా పెరిగి రూ.1,71,200 వద్ద స్థిరపడింది.
కాగా ఈ ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా వాణిజ్య విధానాలు, డాలర్ విలువ క్షీణించడం వంటి కారణాలతో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దీనికి తోడు చైనా, భారత్ వంటి దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున పసిడిని నిల్వ చేస్తుండటం కూడా డిమాండ్‌ను, తద్వారా ధరలను పెంచుతోందని వారు పేర్కొంటున్నారు.
అంత ర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4,335 డాలర్లకు చేరడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు.దేశీయంగా త్వరలో ప్రారంభం కానున్న పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరలు మరింతగా పెరగవచ్చని, కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు మార్కెట్ పోకడలను గమనించి నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.