‘గోల్డ్ స్వీట్’ కిలో @ 1.11 లక్షలు
జైపూర్, అక్టోబర్ 18: దీపావళి పర్వదినం సందర్భంగా రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు చెందిన ‘త్యోహార్’ అనే స్వీట్ షాప్ యజమాని అంజలి జైన్ వినూత్నంగా ఆలోచిం చారు. అన్ని షాపుల్లో సంప్రదాయ మిఠాయిలు విక్రయించినట్లు విక్రయిస్తే.. ఇక తన షాపు ప్రత్యేకత ఏముందని అనుకున్నారో, లేదా సోషల్‌మీడియాలో తన షాపు గురిం చి చర్చ రావాలని కోరుకున్నారేమో తెలియదు గానీ.. తాజాగా తన షాపులో ‘గోల్డ్ స్వీట్’ అమ్మకానికి పెట్టాడు.
బంగారం స్వీట్ అంటే.. కేవలం పేరుకు మాత్రమే కాదు సుమా.. అచ్చంగా 24 క్యారెట్ల తినదగిన బంగారం, కుంకుమ పువ్వు, బాదం, ఆయుర్వేద పదార్థాలతో ఈ స్వీట్స్‌ను తయారు చేయించడం విశేషం. అయితే.. దీని రేటు చూస్తే మాత్రం నోరెళ్ల బెట్టాల్సిందే. ఆ స్వీట్ కిలో ధర అక్షరాలా రూ.1.11 లక్షలు. స్వీట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. స్వీట్ చూసి మనకు నోరూరడం సహజమే గానీ, దాని ధర మాత్రం గుడ్లు తేలేసేలా చేస్తుందనడంలో సందేహం లేదు.




