29-06-2025 12:00:00 AM
సుకుమారంగా కనిపించే కథానాయికలు.. క్రూషియల్‌గా, వైల్డ్ లుక్‌లో విలన్లను రఫ్పాడించే పాత్రల్లో కనిపిస్తే చూడాలని ఏ అభిమానికి మాత్రం ఉండదు చెప్పండి?! ఇలా అభిమానుల సరికొత్త అనుభూతి పంచేందుకు కొందరు హీరోయిన్లు వెనుకాడరు. అనుష్క, సమంత, త్రిష, కీర్తి సురేశ్, దీపిక పడుకొణె, ఆలియాభట్, కత్రినాకైఫ్, కృతిసనన్, కియారా అద్వానీ, కాజోల్..
ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టే తయారవుతుంది. వీళ్లలో కొందరు గతంలో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో యాక్షన్ రోల్స్‌లో అదరగొట్టారు. ఇదే జాబితాలో కొందరు ప్రత్యర్థులతో పోరాడే పాత్రల్లో మెప్పించేందుకు మళ్లీ సిద్ధమవుతున్నారు. అనుష్క, కాజోల్, రష్మిక మందన్న, సంయుక్త మీనన్ తదితరుల యాక్షన్ సీక్వెన్స్‌తో మెప్పించే సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
‘మైసా’గా రష్మిక మదన్న
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమా గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందనుండగా రష్మిక మందన్న లీడ్ రోల్ పోషిస్తోంది.
ఈ చిత్రానికి ‘మైసా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ గత శుక్రవారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ, కన్నడ తదితరు భాషల్లో రానున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.
‘ఏఏ22’లో మరోమారు దీపిక పడుకొణె..
దీపిక పడుకొణె ఇటీవల యాక్షన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. గతంలో ‘పఠాన్’, ‘ఫైటర్’, ‘సింగం3’ చిత్రాల్లో యాక్షన్ సన్నివేశాల్లో నటించింది. ‘ఫైటర్’ కోసమై ప్రత్యేకంగా స్టంట్స్‌లో శిక్షణ తీసుకొని మరీ యాక్షన్‌లోకి దూకటం విశేషం. ఇదిలా ఉండగా టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఇది అల్లు అర్జున్‌కు 22వ సినిమా కావటంతో ‘ఏఏ22’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉందిప్పుడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌లో సైన్స్ ఫిక్షన్, యాక్షన్ -ఫాంటసీ జానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందీ చిత్రం. ఈ సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించడానికి ప్రముఖ స్టూడియోలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు మేకర్స్.
ఇందులో కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది. దీపిక పాత్రను రివీల్ చేస్తూ ఇటీవల మేకర్స్ పంచుకున్న స్పెషల్ వీడియో వైరల్ అయ్యింది.
మా.. కాజోల్
ఎప్పుడైనా హారర్ చిత్రాలు సక్సెస్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. అసలే బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘భూల్ భులయా’, ‘స్త్రీ’ ఫ్రాంచైజీలు బాగానే క్లిక్ అవుతున్నాయి. ఈ క్రమంలో కాజోల్ సైతం ఇలాంటి జానర్‌ను టచ్ చేస్తూ తీసిన సినిమా జూన్ 27న విడుదలైంది.
‘మా’ అనే టైటిల్‌తో విశాల్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అజయ్ దేవగణ్ నిర్మించారు. సైతాన్ యూనివర్స్‌లో భాగంగా ఈ చిత్రం వచ్చింది. దుష్ట శక్తులతో పోరాడే ధీర వనిత అమ్మగా ఈ సినిమా మెప్పించింది. కాజోల్ మొదటిసారి ఇలా హారర్ జానర్‌లో నటించి మెప్పించడం విశేషం.
కీర్తి సురేశ్ ‘రివాల్వర్ రీటా’..
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘రివాల్వర్ రీటా’. దర్శకుడు చంద్రు దీన్ని కామెడీ, థ్రిల్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఇదేకాక ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో ‘కన్ని వెడి’, ‘రఘు తాత’ కూడా ఉన్నాయి.
స్వయంభు.. సంయుక్త మీనన్
పవన్‌కల్యాణ్ ‘భీమ్లా నాయక్’తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త రెండో సినిమాగా కళ్యాణ్‌రామ్‌తో ‘బింబిసార’ నటించింది. మూడో సినిమాగా చేసిన ‘సార్’తో ఆమె ఖాతాలో హ్యాట్రిక్ హిట్లు పడ్డాయి. తర్వాత ‘విరూపాక్ష’లో ఏకంగా నెగిటివ్ టచ్ ఉన్న రోల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఒక్కసారిగా సంయుక్త క్రేజ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం సంయుక్త చేతిలో ఏకంగా ఆరు ప్రాజెక్టులున్నాయి.
నిఖిల్‌తో ‘స్వయంభు’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ‘హైందవ’, బాలకష్ణతో ‘అఖండ2’ చెప్పుకోదగ్గవి. వీటితోపాటు బాలీవుడ్‌లో ‘మహారాగ్ని: క్వీన్స్ ఆఫ్ క్వీన్స్’ కూడా చేస్తోంది. సంయుక్త కత్తి, డాలు పట్టుకొని యుద్ధభూమిలో ఉన్న లుక్‌ను ఇప్పటికే ‘స్వయంభు’ మేకర్స్ రివీల్ చేశారు. మిగతా టైటిల్స్‌ను కూడా పరిశీలిస్తే.. కథానాయకుడితో కలిసి తానూ కదనరంగంలోకి దూకే పాత్రల్లో సంయుక్త మెప్పించనున్నట్టు అర్థమవుతోంది.
అనుష్క.. ఘాటి
‘బాహుబలి’ కథానాయకిగా యాక్షన్‌తో అదరగొట్టింది అనుష్కశెట్టి. అంతేకాకుండా భాగమతి, రుద్రమదేవి వంటి మహిళా ప్రాధాన్య చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించింది. అయితే, కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న అనుష్క మరోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించిన తన కొత్త చిత్రం ‘ఘాటి’ సినిమా జూలై 11న బహుళ భాషల్లో విడుదల కానుంది. ఇందులో అనుష్క బలమైన, బోల్డ్ పాత్రలో గంజాయి వ్యాపారం చేసే స్తుగా కనిపించనుంది. ఇదొక సాహసోపేతమైన ఓ గ్రామీణ మహిళ పాత్ర. అనుష్క గత పాత్రల కంటే చాలా భిన్నంగా ఉంటుంది.
అందాల ఆరబోతతో ఆకర్షించడమే కాదు సివంగిలా రంగంలోకి దూకి యాక్షన్ సీక్వెన్స్‌ల్లోనూ మెప్పిస్తున్నారు కొందరు భామలు. కథను నడిపించడంలో నాయికది కీ రోల్‌గా ఇప్పటికే ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. కానీ, పలు భారతీయ చిత్రపరిశ్రమల్లో మహిళా ప్రాధాన్య చిత్రాలు వరుస కడుతున్నాయిప్పుడు.
ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలదే ట్రెండ్. ఎప్పుడైనా ప్రేక్షకుల అభిరుచిని శిరసావహించడమే తాము చేయాల్సిన పని కాబట్టి అందాల తారలతో అదరగొట్టే యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. యాక్షన్‌కు సై అంటూ అభిమానులను మెప్పిస్తున్న ఆ ముద్దుగుమ్మల ముచ్చట్లు..
వింగ్‌చున్ ఆర్ట్ ఫామ్‌తో అనంతిక
పరిమిత వ్యయంతో కూడిన సినిమాలను కూడా అప్పుడప్పుడు అగ్ర నిర్మాణ సంస్థల నుంచి ఆశించొచ్చు. అలా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొంది, ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే ‘8 వసంతాలు’. ఇదొక ప్రేమజంటకు సంబం ధించిన 8 వసంతాల కథ. ఇంతకుముందు ‘మ్యాడ్’లో నార్నే నితిన్‌కు జోడీగా నటించిన అనంతిక సనీల్‌కుమార్ ఇందులో కథానాయిక.
శుద్ధి అయోధ్య అనే యువ రచయిత్రి పాత్ర. ఇందులో ఓ ప్రేయసిగా గ్లామరస్ లుక్‌తో ఆకర్షించిన అనంతిక మార్షల్ ఆర్ట్స్‌తో కట్టిపడేసింది. ము ఖ్యంగా ఈ సినిమా కోసం కళరి ఫైట్‌తోపాటు వింగ్‌చున్ అనే చైనీస్ ఆర్ట్ ఫామ్‌ను మూడు నెలలపాటు అంజి మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంది.