ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
– ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు
ఉట్నూర్,(విజయక్రాంతి): ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జైనూర్ మండలం జెండా గూడ గ్రామానికి చెందిన గునవంత్ రావ్ తనకి పిడుగు పడి ఎనిమిది మేకలు మృతి చెందాయి వాటి నష్టపరిహారం మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఇంద్రవెల్లి మండలం పెద్ద కేస్లాపూర్ గ్రామానికి చెందిన శేకు తనకు ఆసరా పింఛన్ ఇపించమని కోరారు. జన్నారం మండలం దేవుని గూడెం గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ కు పై అటవీ హక్కు పత్రం మంజూరు కల్పించామని విజ్ఞప్తి చేశారు.సాత్నల మండలం దుబ్బగూడ గ్రామానికి చెందిన అయ్యు తమ గ్రామ పాఠశాల కు షెడ్ నిర్మాణం కొరకు దరఖాస్తు అందజేశారు.
అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు. ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






