తమిళనాడు రైతులకు శుభవార్త
75 వేల వరకు రుణమాఫీ
14.43 లక్షల మంది రైతులకు లబ్ధి
ప్రభుత్వంపై 5,932కోట్ల అదనపు భారం
సీఎం విజయ్ ప్రకటన విడుదల
చెన్నై, జూన్ 16: తమిళనాడులోని సహకార బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేయనున్నట్లు తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ ప్రకటించారు. రూ. 75వేల వరకు పంట రుణాలు తీసుకున్న చిన్న, సన్న, పెద్ద రైతులకు కూడా పూర్తి రుణమాఫీ వర్తిస్తుందని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
రూ. 75వేల కంటే ఎక్కువ రుణాలుంటే ఒక్కొక్కరికి రూ. 35వేల చొప్పున మాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో సచివాలయంలో సీఎం విజయ్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ పథకంలో మార్పులు చేశారు. తాజా రుణమాఫీతో రాష్ట్ర వ్యాప్తంగా 14.43 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని, ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ. 6000 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.5,932 కోట్ల మేర అదనపు భారం పడనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా రుణమాఫీ కింద సహకార బ్యాంకులకు అందించాల్సిన మొత్తాన్ని 45- రోజుల్లో ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపింది. గత నెలలో సన్నకారు రైతులకు రుణమాఫీపై రైతుల్లో ఆగ్రహం పెల్లుబుకి నిరసనలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు.






