18 July, 2026 | 9:23 PM

గోపాల్ మృతితో మరోసారి నేరెళ్ల ఘటనపై చర్చ

18-07-2026 08:45 PM

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని టీఆర్ఎస్ డిమాండ్

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల ఘటన బాధితుడు గంధం గోపాల్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని టీఆర్ఎస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి మజీద్ డిమాండ్ చేశారు. శనివారం పార్టీ నాయకులతో కలిసి గోపాల్ నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి బియ్యం, ఆర్థిక సాయం అందజేశారు.

2017 నేరెళ్ల ఘటన అనంతరం థర్డ్ డిగ్రీకి గురైన బాధితులు ఇప్పటికీ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, సరైన వైద్యం అందక గోపాల్ మృతి చెందడం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాయకులు అనంతరం బాధితులను విస్మరించారని ఆరోపించారు. నేరెళ్ల బాధితులకు కల్వకుంట్ల కవిత అండగా ఉంటారని పేర్కొంటూ, గోపాల్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం, ఉపాధి భరోసా కల్పించాలని కోరారు.