18 July, 2026 | 10:13 PM

జక్కాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌లో రూ.40 లక్షల డైనింగ్ హాల్ ప్రారంభం

18-07-2026 09:11 PM

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్‌కు దీటైన విద్య: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

సిద్దిపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన డైనింగ్ హాల్-కమ్-మీటింగ్ హాల్, కిచెన్ షెడ్లను శనివారం ఆయన ప్రారంభించారు.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన మంత్రి వారిని అభినందించారు. పాఠశాలకు డైనింగ్ హాల్, కిచెన్ నిర్మించి అందించిన దాత దొంతుల సుధాకర్ కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామంలోని ఇతర దాతలు కూడా విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 50 వేల మంది ఉపాధ్యాయులను నియమించిందని మంత్రి తెలిపారు. విద్యార్థుల కోసం ఉదయం అల్పాహార పథకం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ పథకాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, చేరికలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

యంగ్ ఇండియా పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సదానందం, జిల్లా ఇన్‌చార్జి డీఈఓ, జడ్పీ సీఈఓ రమేష్, గ్రామ సర్పంచ్ భానుచందర్, దాత దొంతుల సుధాకర్, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.