29 August, 2026 | 1:18 PM

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

29-08-2026 12:44 PM

ఎరువుల కోసం కొత్త డిజిటల్ యాప్ లతో రైతులకు తీవ్ర ఇబ్బందులు  

గంభీరావుపేట, ఆగస్టు 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ స్వల్ప వర్షాలతో కొంత సాగు ప్రారంభమైందని నాఫ్స్కోబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు తెలిపారు. శనివారం గంభీరావుపేట  మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎరువుల డిజిటల్ యాప్‌ల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సమయానికి ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాళేశ్వరం నీటి వినియోగంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

రైతులకు నీరు అందిస్తే ఎరువులు, బోనస్, ధాన్యం కొనుగోలు బాధ్యత వస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం నీటి విడుదలపై నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. గతంలో ఇచ్చిన 100రోజుల హామీలు 1000 రోజులు గడిచిన అమలు కాలేదని, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ పిలుపు మేరకు సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు వివిధ రంగాలకు సంబంధించిన  నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. మహిళలకు రూ 2500 ఆర్థిక సహాయం, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతుబంధు విద్యార్థుల ప్రోత్సాహకాలు అమలు కాలేదు అన్నారు.ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్  నాయకులు వెంకట్ యాదవ్,గంధ్యాడపు రాజు, లింగం యాదవ్, కమ్మరి రాజారాం, ఎగదండి స్వామి, చెవుల మల్లేశం యాదవ్, రాజేందర్,దిలీప్ కుమార్ ఏడబోయిన రాజు రత్నాకర్, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.