4 May, 2026 | 5:42 PM

బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలి

04-05-2026 04:38 PM

కేసముద్రం,(విజయక్రాంతి): పిడుగుపాటుతో గురై మూడు ఎడ్లు దుర్మరణం పాలైన ఘటనలో బాధిత రైతు భత్యం సమ్మయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని, వెంటనే పరిహారం అందించాలని, ధాన్యం, మొక్క జొన్న కొనుగోళ్లలో ఏర్పడ్డ ప్రతిష్టంబన తొలగించాలని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి పిడుగుపాటు బాధిత రైతు సమ్మయ్యను పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

అలాగే మండలంలోని వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకునేవారని పేర్కొన్నారు. రైతులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న మాజీ ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో మాట్లాడి రైతులకు ఇబ్బందులు వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని పేర్కొన్నారు.