27 June, 2026 | 2:34 PM

భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం

27-06-2026 01:28 PM

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాస్త్రోక్తంగా పనులు చేపట్టాలి.

భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు – జిల్లా కలెక్టర్ అంకిత్

భద్రాద్రచలం,(విజయక్రాంతి): భారతదేశంలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం(Bhadrachalam temple) శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పునరుద్ధరణ పనులు ఆగమ శాస్త్ర ప్రకారం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు శనివారం ఘనంగా ప్రారంభించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆలయ పునరుద్ధరణ పనులు జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట , వేద పండితుల మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా   ఉదయం 7.30 గంటలకు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ప్రసిద్ధిగాంచిన భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం మాడవీధులు భక్తులకు సౌకర్యంగా ఉండేలా నిర్మాణాలు చేపట్టి దేవస్థానమును టెంపుల్ సిటీగా రూపొందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ 540 కోట్లలను మంజూరు చేసి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం జరిగిన రోజునే గౌరవ ముఖ్యమంత్రి చేతులు మీదుగా శంకుస్థాపన చేయించడం జరిగిందన్నారు.  మొదటి విడతగా రూ 350 కోట్లు విడుదల కాగా ప్రస్తుతం రూ 200 కోట్లతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన ఈ దేవస్థానానికి భక్తులు అధికంగా వస్తున్నందున వారు ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శనం చేసుకునేలా సౌకర్యాలు కల్పిస్తూ పునరుద్ధరణ పనులు జరిపించడం జరుగుతుందని, 2027 జూన్ మాసంలో ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాల నాటికి పూర్తిస్థాయిలో దేవస్థానం పునరుద్ధరణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అన్నారు. ఆలయ పునరుద్ధరణ పనులను ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా, సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్త పద్ధతిలో నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పునరుద్ధరణ పనుల సందర్భంగా ఆలయ పవిత్రతకు, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ఎలాంటి భంగం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి నిర్మాణ ప్రక్రియను వేద పండితులు, ఆగమ శాస్త్ర నిపుణుల సూచనల మేరకు చేపట్టాలని పేర్కొన్నారు.

పనుల కారణంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. స్వామివారి దర్శనం, నిత్య పూజలు, అర్చనలు, ఇతర సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల రాకపోకలు, క్యూ లైన్లు, తాగునీరు, పరిశుభ్రత, భద్రత తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర రావు, ఇరిగేషన్ ఈ ఈ జానీ భద్రాచలం డిప్యూటీ తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు సర్పంచ్ పూణేం కృష్ణ ఈవో గ్రామపంచాయతీ శ్రీనివాస్ మరియు వేద పండితులు, దేవస్థానం అధికారులు, ఇంజినీరింగ్ శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.