30 August, 2026 | 4:29 PM

కెనడా అమ్మాయి.. నిజామాబాద్ అబ్బాయి.. ఒక్కటైన ప్రేమజంట

30-08-2026 03:22 PM

ఖండాంతరాలు దాటిన ప్రేమ.. 

నిజామాబాద్‌లో ఒక్కటైన ప్రేమజంట

బోధన్,ఆగస్టు 30 (విజయక్రాంతి): ప్రేమకు ప్రాంతం, భాష, జాతి, కులం, మతం అడ్డంకులు కావని మరోసారి నిరూపించింది ఓ ప్రేమజంట. కెనడాకు చెందిన యువతి, నిజామాబాద్‌కు చెందిన యువకుడు ప్రేమలో పడి ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఖండాంతరాలు దాటిన ఈ ప్రేమకథ ప్రస్తుతం నిజామాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్‌కు చెందిన తాటిపాముల సంజయ్ చదువు, ఉద్యోగం నిమిత్తం కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో కెనడాకు చెందిన సబ్రినా ఏమీస్పైన్తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తొలుత స్నేహంగా ప్రారంభమైన వీరి పరిచయం క్రమంగా మరింత బలపడింది. ఒకరి అభిప్రాయాలు, ఆలోచనలు, వ్యక్తిత్వాలను మరొకరు అర్థం చేసుకోవడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది.

కాలక్రమేణా ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇరు కుటుంబాల పెద్దలు యువజంట అభిప్రాయాలను గౌరవించి వారి వివాహానికి అంగీకారం తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆదివారం నిజామాబాద్‌లో వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. కెనడా నుంచి వచ్చిన వధువు సబ్రినా, నిజామాబాద్‌కు చెందిన సంజయ్ సంప్రదాయబద్ధంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో ఇరు కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. వివాహ వేడుకకు బంధువులు, స్నేహితులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. నిజమైన ప్రేమకు సరిహద్దులు ఉండవని, మనసులు కలిస్తే దేశాలు, భాషలు, సంస్కృతులు కూడా అడ్డంకులు కావని పేర్కొన్నారు. రెండు భిన్న సంస్కృతులకు చెందిన యువతీ యువకులు కుటుంబాల సమ్మతితో ఒక్కటవడం అభినందనీయమని అన్నారు. కెనడాలో మొదలైన పరిచయం ప్రేమగా మారి, చివరకు నిజామాబాద్‌లో వివాహ బంధంగా మారడంతో సంజయ్–సబ్రినా జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఖండాంతర ప్రేమ వివాహం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించడంతో పాటు, ప్రేమకు హద్దులు లేవనే సందేశాన్ని అందిస్తోంది.