12 May, 2026 | 6:16 PM

రైతు సంక్షేమాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

12-05-2026 05:12 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రైతు సంక్షేమాభివృద్ధి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తుందని తెలిపారు.

కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, కొనుగోలు ప్రక్రియ వేగంగా చేపట్టాలని, అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ కె.హరిత, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు.

అనంతరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మార్క్ ఫెడ్ ద్వారా జిల్లాలోని జైనూర్, కాగజ్ నగర్, కౌటాల మండలాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటివరకు 900 కుంటల మొక్కజొన్నలు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. యాసంగి మరి ధాన్యం కొనుగోలు కొరకు 40 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, 9 కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రధానంగా దహేగాం, లగ్గాం, ఒడ్డుగూడ, గిరవెళ్లి, చంద్రపెల్లి, సాండ్ గాం, దుబ్బగూడ, వీరవెల్లి, గుడ్లబోరి, సిర్పూర్- టి, సీతానగర్, రవీంద్ర నగర్ కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

హమాలీల సంఖ్య, తూకం యంత్రాలను అదనంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, జిల్లాలో గోనె సంచుల కొరత లేదని, స్థానికంగా రైతుల వద్ద ఉంటే డబ్బులు చెల్లించి కొనుగోలు చేసుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల హమాలీల కొరకు ఆధారపడకుండా స్థానికంగా ఉన్న హమాలీలను వినియోగించుకోవాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల వ్యవసాయ శాఖ అధికారి, మండల వ్యవసాయ విస్తరణ అధికారులను బాధ్యులుగా నియమించాలని, జిల్లాస్థాయి అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను ప్రతిరోజు సందర్శించి కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించి ఉదయం, సాయంత్రం నివేదికలు అందించాలని తెలిపారు.

జిల్లాలో గోదాముల కొరత లేదని, తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు తరలించి రైస్ మిల్లర్లు ధాన్యాన్ని దించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధాన్యం తరలించేందుకు వాహనాల కొరత లేదని, అవసరమైతే స్థానికంగా ఉన్న వాహనాలను వినియోగించుకోవాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం  కొనుగోలు ప్రక్రియలు రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ  అభివృద్ధి అధికారి దత్తారావు, సహకార శాఖ అధికారి మోహన్, జిల్లా రవాణా అధికారి రామ్ చందర్, మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ ,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.