1 March, 2026 | 1:55 AM

కూల్చివేతల ప్రభుత్వం

01-03-2026 12:00 AM
  1. ఇండ్ల కూల్చివేతలో రేవంత్ రెడ్డికి గిన్నిస్ రికార్డు ఖాయం
  2. మావోయిస్టుల విషయంలో ద్వంద్వ వైఖరి
  3. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత రైతుభరోసాను పూర్తిగా ఎగ్గొట్టనున్న సర్కార్
  4. విద్యా కమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేయండి
  5. కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): కాంగ్రెస్‌ది కూల్చివేతల ప్రభుత్వ మని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఇండ్లు కూలుస్తున్నారు.. గుడులను కూలుస్తున్నారని... ఇలానే ఉంటే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తారని పేర్కొన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం పేదలకు ఇండ్లు నిర్మించడంలో ముందుంటే.. కాంగ్రె స్ కూల్చివేతల్లో ముందు ఉందన్నారు.

గిన్నిస్ బుక్ వరల్డ్ రికాడ్స్ వాళ్లకు దరఖాస్తు చేసుకుంటే.... కూల్చివేతల్లో రేవంత్ రెడ్డికి గిన్నిస్ రికార్డ్ దక్కుతుందని విమర్శించారు. కోకాపేటలో వక్ఫ్ బోర్డు భూముల జోలికి వెళ్లరు... మైనింగ్ భూముల జోలికి వెళ్లరు... కానీ అధ్యాత్మికమైన శారదా పీఠంలోని గుడులను కూలుస్తున్నారని మండిపడ్డారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బసవ లక్ష్మీ నారాయణ, రాష్ట్ర నాయకులు కొప్పు భాష తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

విద్యా కమిషన్ నివేదిక సిగ్గుచేటు

విద్యా రంగ అభివృద్ధికి అవసరమైన సిఫారసులు చేయకుండా ఉపాధ్యాయుల జీతా లు తగ్గించాలంటూ విద్యా కమిషన్ నివేదిక ఇవ్వడం సిగ్గు చేటని బండి సంజయ్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఏసీ గదుల్లో కూర్చుని రూపొందించిన నివేదికను చెత్తబుట్టలో వేయాలన్నారు. ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 45 శాతానికి పెంచాలని చేసిన సిఫారసులను అమలు చేస్తే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను ఏ విధంగా మెరుగుపర్చాలనే సోయి లేకుండా విద్యా కమిషన్ పూర్తి భిన్నంగా నివేదిక ఇవ్వ డం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అసలు విద్యారంగంపై అవగాహనే లేదు... విద్యా కమిషన్‌లో విద్యావేత్తలు లేరని విమర్శించారు.  

అర్బన్ నక్సలైట్ భావజాలమున్న వాళ్లతో కమిటీలు 

‘ఆకునూరు మురళిది అర్బన్ నక్సలైట్ భావజాలం. ఆయన ఆధ్వర్యంలో కమిషన్ వేయడాన్ని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చే స్తోంది. అర్బన్ నక్సలైట్ ఆధ్వర్యంలోని కమిషన్ ద్వారా నివేదిక తెప్పించుకుని ప్రభుత్వం ఏం సాధించింది?’ అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ విధానం అవలంబిస్తున్నారని, లొంగి పోయి న మావోయిస్టులను పిలిచి ప్రోత్సహిస్తూనే మరోవైపు అర్బన్ నక్సలైట్ భావజాలమున్న వాళ్లను కమిటీలు, కమిషన్లలో వేస్తున్నారని ఆరోపించారు.  

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి 

తెలంగాణ రైతాంగానికి వెంటనే రైతు భరోసా ఇవ్వాలని పేర్కొంటూ కిసాన్ మోర్చా కార్యాచరణ చేపట్టబోతోందన్నారు. సంక్రాంతి పండగ అయిన వెంటనే రైతు భరోసా నిధులను జమ చేస్తామని ఒకసారి... మున్సిపల్ ఎన్నికలైపోగానే నిధులను జమ చేస్తామని ఫిబ్రవరి 4న మరోసారి సీఎం హామీలిచ్చారు. కానీ ఇంతవరకు అమలు చేసిన దాఖలాల్లేవన్నారు.

ఇప్పటి వరకు రైతు భరోసా రెండు వాయిదాల పైసలు రైతులకు బాకీ ఉన్నాయని, మూడో వాయిదా వచ్చే సమయానికి రైతు భరోసా పైసలిచ్చి మిగిలిన రెండు వాయిదాలను ఎగ్గొట్టేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలయ్యాక రైతు భరోసా పైసలను ఇవ్వకుండా పూర్తిగా ఎగ్గొట్టాలని చూస్తున్నారని, ఆ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.