భూ మాఫియాను వదిలిపెట్ట!
- ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు అండగా ఉంటా
- గతంలో అక్రమార్కులు ‘ఫోర్జరీ పట్టాలు’ సృష్టించి పేదల నిలువు దోపిడీ
- టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
ఖమ్మం, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): ఖమ్మం భూదాన్ భూముల మాఫియాను వదిలిపెట్టబోనని, వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటానని టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పారు. గతంలో బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ మాఫియా, భూదా న్ బోర్డు కిందిస్థాయి సిబ్బంది కుమ్మక్కై, ‘ఫోర్జరీ పట్టాలు’ సృష్టించి పేదలను నిలువు దోపిడీ చేశారని మండిపడ్డారు. శనివారం ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల గ్రామంలో భూదాన్ భూముల బాధితులను పరామర్శించారు.
భూమాఫియా చేతి లో ఎలా దగా పడ్డారో వారు చెప్పిన మాట లు విన్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్ల న్న మాట్లాడుతూ.. కొందరు బ్రోకర్లు, రియ ల్ ఎస్టేట్ మాఫియా, గతంలో భూదా న్ బోర్డులో పనిచేసిన కిందిస్థాయి సిబ్బంది కు మ్మక్కై పాత స్టాంప్ పేపర్లు, నకిలీ భూదాన్ సీల్స్ ఉపయోగించి తలా 100 చదరపు గజాల ’ఫోర్జరీ పట్టాలు’ సృష్టించి ఈ అమాయక పేదలను నిలువునా దోచుకున్నారని ఆరోపించారు. లక్షలు దండుకున్న ఆ దొంగలను వదిలేసి, ఇప్పుడు గూడు కట్టుకున్న పేదల ఇళ్ల మీదకు అధికారులు బుల్డో జర్లు పంపడం దారుణమని మండిపడ్డారు.
హైకోర్టు తీర్పును అమలు చేయండి
పేదలు నిర్మించుకున్న ఇళ్లకు రక్షణ కల్పి స్తూ హైకోర్టు పలుమార్లు తీర్పులు ఇచ్చిందని, 2018, 2021, 2023లో ఇచ్చిన ఉత్త ర్వుల ప్రకారం ఎవరినీ ఖాళీ చేయించవద్దని కోర్టు స్పష్టం చేసిందన్నారు. వీరు పేదవారుగా గుర్తించిన న్యాయస్థానం, ఇప్పటికే ఉన్న ఇళ్లపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించిందని, అధికారులెవరూ పేదల ఇళ్ల వైపు వెళ్లేవద్దని హెచ్చరించినట్టుగా తెలిపారు.
ఈ భూ కుంభకోణానికి అసలు సూ త్రధారులైన మాఫియా వ్యక్తుల పేర్లను వెం టనే బయటపెట్టి, వారిని అరెస్ట్ చేయాలని, మోసపోయిన నిరుపేదలను ఆక్రమణదారులుగా కాకుండా, బాధితులుగా, సాక్షులుగా పరిగణించాలని కోర్టు పేర్కొన్నదని వివరించారు. నకిలీ పట్టాలు అయినా మోస పోయింది నిరుపేదలు గనుక భూదాన్, గ్రామదాన్ చట్టం ప్రకారం ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఆ 100 గజాల స్థలాలకు చట్టబద్ధంగా అసలైన భూదాన్ పట్టాలు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు.
అయినా కూ డా ప్రభుత్వం ఇళ్లను కూల్చి నిరాశ్రయులను చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ సమస్యను నేను ఇక్కడితో వదిలిపెట్టను. ఖమ్మం కలెక్టర్ నివేదిక ఆధారంగా, రాబో యే శాసనమండలి సమావేశాల్లో వెలుగుమట్ల భూ కుంభకోణంపై ప్రభుత్వాన్ని నిలదీ స్తా. దగాపడ్డ ప్రతి పేదవాడికి న్యాయం జరి గి, వారికి శాశ్వత పట్టాలు దక్కే వరకు వారి పక్షానే పోరాడుతా’ అని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.
అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చేందుకు వెళ్లగా ఆయన లేకపోవడంతో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా తీన్మార్ మల్లన్న రాక తెలిసి కలెక్టర్ విధులకు గైర్హాజరయ్యారని తెలిసింది. బాధితులకు తక్షణమే అదే భూమిలో పునరావాసం కల్పించాలని, ప్రతి కుటుంబానికి రూ.లక్ష సహాయం అందించాలన్నారు.




