19-07-2025 01:16:49 AM
గత ప్రభుత్వం గల్లా ఖాళీ చేసింది, ఆర్థిక విధ్వంసం చేసింది: మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి, జూలై 18 ( విజయ క్రాంతి) : మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరులోని వెంకటసాయి గార్డెన్స్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో నూతన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి చెక్కులు, సీఎంఆర్‌ఎఫ్, ఇందిరమ్మ ఇళ్లు, స్టీల్ బ్యాంక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలో స్టీల్ బ్యాంక్ ప్రారంభించాం. భీమదేవరపల్లి మండలంలోని 44 మహిళా సంఘాల్లో 21 సంఘాలకు మొదటి దశలో స్టీల్ సామాగ్రి అందించాం. మిగిలిన 23 సంఘాలకు త్వరలో అందించనున్నాం అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి స్టీల్ పాత్రల వినియోగాన్ని పెంచాలన్నారు. వేడి అన్నం ప్లాస్టిక్ కవర్లలో వాడటం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ స్టీల్ పాత్రలు వాడాలి, అని సూచించారు.
4900 స్టీల్ గ్లాసుల పంపిణీ
భీమదేవరపల్లిలోని 49 హోటళ్లకు 4,900 స్టీల్ గ్లాసులు అందించినట్టు తెలి పారు. గత పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా రాకపోయినా ఈ మండలం లో మొదటి సంవత్సరంలో 3,500 ఇళ్లను మంజూరు చేసి, రెండవ దశలో మరిన్ని ఇళ్లు మంజూరు చేసినట్టు వివరించారు.
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు
ప్రతి ఇంటి నిర్మాణానికి 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందిస్తున్నట్టు వెల్లడించారు. 400600 చదరపు అడుగులలోపు ఇల్లు నిర్మించాలన్నారు. మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల వడ్డీలేని రుణం అందిస్తామని తెలిపారు.
తమది రైతు ప్రభుత్వం
గత ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూశారు. మేము 1,286 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశాం. రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం వంటివి అందిస్తున్నాం, అని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం లబ్ధిపొందినట్టు చెప్పారు.
మహిళల అభివృద్ధికి ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్టు తెలిపారు. 40 లక్షల రూపాయల విలువైన చెక్కులు ఇప్పటికే పంపిణీ చేశామని చెప్పారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది, పథకాలను అమలు చేయలేకపోయింది. మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం, అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష, ఆర్డీవో రమేష్ రాథోడ్, తహశీల్దార్ రాజేష్, నాయబ్ తహశీల్దార్ సూర్య, రెవెన్యూ సిబ్బంది, కాంగ్రెస్ నేతలు, పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.