తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ
సంఖ్యాబలం చూపించాలన్న గవర్నర్
విజయ్ ప్రమాణస్వీకారంపై కొనసాగుతున్న టెన్షన్
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే(Tamilaga Vettri Kazhagam) అధినేత విజయ్ 24 గంటల్లో రెండుసార్లు గవర్నర్ ను కలిశారు. ఇవాళ 45 నిమిషాల పాటు ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ తో చర్చలు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ గవర్నర్ ను కోరారు. విజయ్ విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం చూపించాలని గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ కోరారు. విజయ్ సంఖ్యాబలం లేఖపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటామని గవర్నర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ మద్దతు తెలిపినా టీవీకేకు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరం. ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు సమీకరించేందుకు టీవీకే ప్రయత్నాలు చేస్తోంది. అటు స్టాలిన్ నివాసంలో కీలక సమావేశం కొనసాగుతోంది. పార్టీ ముఖ్య నేతలతో స్టాలిన్ సమావేశమయ్యారు. వామపక్షాల నేతలు స్టాలిన్ ను కలిశారు. టీవీకే విజయ్ కు మద్దతు ఇచ్చే అంశంపై చర్చించారు. వీసీకే, వామపక్షాలు డీఎంకే కూటమిలో ఉన్నాయి. స్టాలిన్ ను ఒప్పించిన తర్వాతే వీసీకే, వామపక్షాలు విజయ్ కు మద్దతు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.






