రాజపేటలో బీఆర్ఎస్‌కు షాక్..
కాంగ్రెస్‌లోకి సర్పంచ్ గొడుగు ఎల్లన్న
వనపర్తి మండలం : వనపర్తి మండలం రాజపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ సర్పంచ్ గొడుగు ఎల్లన్నతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సర్పంచ్‌తో పాటు బాలయ్య, విష్ణు, చంద్రయ్య, తిరుపతయ్య తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, బాలరాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన వారికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. గత పాలనకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందించాలని, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాములు, సహదేవుడు, దత్తయ్యపల్లి సర్పంచ్ వెంకటయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్యతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






