13 June, 2026 | 2:59 AM

కలెక్టరేట్ ఎదుట జీపీ కార్మికుల ధర్నా

13-06-2026 01:45 AM

మహబూబాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): సమస్యల పరిష్కారంతోపాటు, ఆరు నెలల పెండింగ్ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో జీపీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి, గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మైనుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 12,790 గ్రామపంచాయతీలో సుమారు 53 వేలమంది గ్రామపంచాయతీ ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారని, గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా, ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని ఆరోపించారు.

పారిశుద్ధ్య కార్మికులు ఏళ్ల తరబడిగా పనిచేస్తున్నప్పటికీ, ఉద్యోగ భద్రత, పర్మినెంట్, కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం చేయడం లేదని విమర్శించారు. మొదటి పిఆర్సిలో గ్రామపంచాయతీ కార్మికులను చేర్చకపోవడం శోషనీయమని, రెండవ పిఆర్సి లోనైనా గుర్తించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, పాత కేటగిరీలను కొనసాగించాలని, కారోబార్, బిల్ కలెక్టర్ లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని, మట్టి ఖర్చుల పేరుతో 30 వేల రూపాయలు ఇవ్వాలని, పంచాయతీ కార్మికులందరికీ 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

లేని ఎడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బొల్లం ఎల్లయ్య, కారం సురేష్ఙ, తాడూరి శాంతి కుమార్, కందగట్ల యాకయ్య, బాబు, భక్తుల వెంకటయ్య, దాస్, కుమార్, నాగేశ్వరరావు, ముదాకర్, శీను, హెచ్ వెంకన్న, రాములు, సురేష్,  దస్తగిరి, లతీఫ్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.