17 April, 2026 | 1:44 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్

15-04-2026 01:48 PM
  1. రైతులకు ఉచితంగా టార్పాలిన్ పట్టాలు అందివ్వాలి
  2. ఐకెపి కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి
  3. రైతులను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోం
  4. సీపీఐ జిల్లా కార్యదర్శి బచ్చనగొని గాలయ్య

సంస్థాన్ నారాయణపూర్,(విజయ క్రాంతి): నారాయణపురం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం , ఐకెపి సెంటర్ల ద్వారా  ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించి రైతుల వద్ద వడ్లను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు(CPI District Secretary) బచ్చనగొని గాలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ, రైతు సంఘం నాయకులతో కలిసి నారాయణపురం మండల కేంద్రంలోని  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి అక్కడ పోసిన ధాన్యం రాశులను పరిశీలించి రైతులతో మాట్లాడారు.

గత పది రోజుల నుండి ధాన్యం ఆరబోసి సాయంత్రం వేళలో కప్పి ఇండ్లకు వెళ్తున్నారని వర్షం వస్తే వడ్ల మీద కప్పడానికి  టార్పాలిన్ సౌకర్యం కూడా లేదని అన్నారు. ప్రాథమిక అవసరాలైన మంచినీటి సౌకర్యం, టెంటు, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటుచేసి రైతులకు ఉచితంగా అందివ్వాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు. ఒకపక్క ప్రభుత్వం అuన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తున్నా క్రింది స్థాయిలో  అధికారుల నిర్లక్ష్యం మూలంగా సరిగ్గా అమలు కావడం లేదని ఆయన అన్నారు. అధికారులు రెండు రోజుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని అధికారులను హెచ్చరించారు.