25 April, 2026 | 3:37 AM

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

25-04-2026 01:11 AM

 డీసీఓ ప్రవీణ్ కుమార్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), ఏప్రిల్ 24:ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ (డీసీఓ) ప్రవీణ్ కుమార్ కోరారు.శుక్రవారం మండలంలోని సూర్యానాయక్ తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ధాన్యంతూకం,తేమశాతం పరీక్ష,గన్ని బ్యాగుల లభ్యత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

కొనుగోలు ప్రక్రియలో ఎక్కడ జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్ల వివరాలను అదేరోజు ఓసీఎంఎస్ ట్యాబ్ లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.కేంద్రంలో ఇప్పటివరకు 2989 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్,గిర్థవార్ పాటి వెంకట్ రెడ్డి,కేంద్రం నిర్వాహకులు సునీత,రైతులు,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.