ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ కేంద్ర నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం, జిల్లాలోని చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేపట్టారు.ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, వడ్ల నాణ్యత, తేమ శాతం పరీక్షలు, బస్తాల నిల్వలు, హమాలీల సేవలు, రవాణా ఏర్పాట్లు, ట్రక్ షీట్, కాంటాలు, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే రైతులకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలపై ఆరా తీశారు.
రైతుల నుంచి ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎండల దృష్ట్యా రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని నాణ్యతా ప్రమాణాల ప్రకారం త్వరితగతిన కొనుగోలు చేసి, ఎటువంటి ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే లారీల ద్వారా ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ ప్రక్రియ సకాలంలో చేపట్టాలని, లారీలలో ధాన్యం బస్తాలను వేగంగా నింపి, ఓ వ్యక్తి లారీతో పాటు సంబంధిత మిల్లులకు వెళ్లి, అక్కడ అన్ లోడింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.






