15 August, 2026 | 5:48 PM

ఆహార భద్రతకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట

15-08-2026 05:11 PM

ఆకలి లేని తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు: మంత్రి సీతక్క

ములుగు, ఆగస్టు 15 (విజయక్రాంతి): పేదల ఆకలి తీర్చుటకు, ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఆహార భద్రత కార్డులు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్వహించిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, పేద కుటుంబాలు కూడా నాణ్యమైన సన్న బియ్యంతో రెండు పూటలా కడుపునిండా భోజనం చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి  శ్రీకారం చుట్టిందన్నారు.

పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన బియ్యం తినాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. సన్న బియ్యం ప్రయోజనం ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి అందాలంటే రేషన్ కార్డు కీలకమని, అందుకే అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. గతంలో రేషన్ కార్డుల కోసం ఎంతోమంది పేదలు ఎదురుచూశారని, ప్రజా ప్రభుత్వం అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి రేషన్ కార్డులు అందించే ప్రక్రియను వేగవంతం చేసిందన్నారు. రేషన్ కార్డు కేవలం బియ్యం పొందేందుకు మాత్రమే కాకుండా ఆరోగ్యశ్రీ తో పాటు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఉపయోగపడుతుందని 

మంత్రి తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేని పేద కుటుంబాలను గుర్తించి వారికి ముందుగా కార్డులు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు. ఆర్థికంగా స్థిరంగా ఉన్నవారి కంటే నిజమైన పేదలు, నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కొనుగోలు శక్తి లేని కుటుంబాలకు ప్రభుత్వ సహాయం ముందుగా అందాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది పేదలకు ఏ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి అనే విషయాలపై అవగాహన కల్పిస్తూ వారికి అధికారులు మార్గదర్శకులుగా ఉండాలని మంత్రి సూచించారు.

తహసీల్దార్లు, ఎంపీడీఓలు, రేషన్ డీలర్లు, పంచాయతీ కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మహిళలందరూ స్వయం సహాయక సంఘాల్లో చేరి ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అర్హులైన ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు అందించడంతో పాటు తలసేమియా బాధితులకు కూడా పింఛన్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పేదల కష్టాలు, కన్నీళ్లు తుడిచి వారి జీవితాల్లో భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డీవో కృష్ణవేణి, సివిల్ సప్లై అధికారి షా ఫైజల్ హుస్సేని, డియం కృష్ణవేణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి,  సంబధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.