వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం చోరీ
రైతుకు చెందిన 107 మక్కల బస్తాలు మాయం..?
అచ్చంపేట: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో( Agricultural Market Yard) భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. మార్కెట్ యార్డుకు అమ్మకం కోసం ధాన్యం బస్తాలు మాయమయ్యాయి. రైతుకు చెందిన 107 మొక్కజొన్న ధాన్యం బస్తాలు రాత్రికి రాత్రే దొంగతనానికి గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేటలోని సాయినగర్ కాలనీకి చెందిన రైతు మంత్రాల జితేందర్ తాను పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని బస్తాల్లో నింపి దాన్ని అమ్మేందుకు అచ్చంపేట మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. మంగళవారం మధ్యాహ్నం వరకు మార్కెట్ ప్రాంగణంలోనే ఆ బస్తాల కుప్ప సురక్షితంగా ఉంది. రైతు వ్యక్తిగత పని కోసం ఇంటికి వెళ్లి, మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం వచ్చి చూసేసరికి అక్కడ ఉన్న వాటిలో 107 మొక్కజొన్న ధాన్యం సంచులు కనిపించలేదు. దీంతో రైతు తీవ్ర అవేదన వ్యక్తం చేశారు.
పోలీసులకు ఫిర్యాదు: మార్కెట్ యార్డులో చాలా రోజులుగా నిల్వ ఉంచిన తన ధాన్యం బస్తాలు ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో రైతు జితేందర్ ఒక్కసారిగా షాక్‌కు గురై అక్కడే కుప్పకూలిపోయారు. ఆరుగాలం కష్టపడి, చెమటోడ్చి పండించిన పంటను అదును చూసి గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. కళ్లముందే నా కష్టం మాయమైందని బాధిత రైతు కన్నింటి పర్యంతమయ్యారు. ధాన్యం చోరీ ఘటనపై బాధిత రైతు అచ్చంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మార్కెట్ యార్డులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, దోషులను త్వరితగతిన పట్టుకుని కఠినంగా శిక్షించాలని, అలాగే తన పంటను తనకు దక్కేలా న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే వ్యవసాయ మార్కెట్ యార్డులోనే రైతులకు రక్షణ లేకపోతే ఎలా అని సహచర రైతులు ప్రశ్నిస్తున్నారు.






