ఇంటికో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి
సర్పంచ్ దేవుబాయి
జెండాగుడలో గ్రామసభ
సిరికొండ,(విజయక్రాంతి): వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని సర్పంచ్ దేవుబాయి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిరికొండ మండలంలోని జెండాగుడ గ్రామపంచాయతీలో శనివారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు సొంత నిధులతో ప్రతి ఇంటికి చెత్త బుట్టలు అందజేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, గంజాయి మొక్కల నిర్మూలన, నేరాల నివారణ, ఓటర్ మ్యాపింగ్ ప్రాధాన్యంపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ భీం రావు, జీపీఓ సురేష్, వైద్యులు రేణుక, కృష్ణ, పోలీసు సిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






