17 June, 2026 | 1:09 AM

వెంకటాపురం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రామసభ.. ప్రజాభిప్రాయాల సేకరణ

17-06-2026 12:04 AM

అశ్వాపురం, జూన్ 16 (విజయక్రాంతి): మండలంలోని మామిళ్లవాయి రెవెన్యూ గ్రామ పరిధిలోని వెంకటాపురం గ్రామ పంచాయతీలో లెవల్ క్రాసింగ్ (ఎల్సీ) నెం. 28 వద్ద ప్రతిపాదిత రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణానికి సంబంధించి నిరభ్యంతర ధృవీకరణ పత్రం (ఎన్వోసీ) జారీ అంశంపై మంగళవారం గ్రామసభ నిర్వహించారు.

ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు భద్రతా ప్రమాణాలు మెరుగుపడి రవాణా సమస్యలు పరిష్కారమవుతాయని అధికారులు వివరించారు. గ్రామస్థులు తమ అభిప్రాయాలు, సూచనలు, వినతులను వెల్లడించగా వాటిని సంబంధిత అధికారులు నమోదు చేసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యప్రకాశ్, గ్రామ సర్పం, వార్డు సభ్యులు, రైల్వే శాఖ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (పాత్వే), సూపరింటెండెంట్, ఎంపీడీఓ కార్యాలయ ప్రతినిధులు, మండల సర్వేయర్, గిర్దావర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.