17 June, 2026 | 1:00 AM

దిన దిన గండం!

17-06-2026 12:00 AM
  1. హామీలకే పరిమితం అవుతున్న ఈత వాగు వంతెన నిర్మాణం 
  2. రూ. 2 కోట్లు మంజూరైన పనులు శూన్యం 
  3. 10 గ్రామాలకు శాపం

చర్ల, జూన్ 16, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల ప్రజలకు ఈతవాగు వంతెన కలగానే మిగిలిపోతోంది. చర్ల - లింగాపురం ప్రధాన రహదారిపై ఈతవాగుపై హైలెవెల్ వంతెన నిర్మాణం ఏళ్లుగా హామీలకే పరిమితమైంది. కొద్ది రోజుల క్రితం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ వంతెనకు 2 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఘనంగా ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో ఒక్క ఇటుక కూడా పడలేదు.

వర్షాకాలం సమీపిస్తున్నా అధికారుల నుంచి ఎలాంటి చర్యలు కనిపించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 గ్రామాలకు వాగే శాపంగా మారింది  ఈతవాగు ఉధృతంగా ప్రవహిస్తే చాలు... లింగాపురం, దండుపేట, కొత్తపల్లి, గొంపల్లి, మొగళ్లపల్లి, ఆనంద్ కాలనీ, చింతకుంట, సీ.కత్తిగూడెం, వీరాపురం, గొమ్ముపులిబోయినపల్లి, 10 గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి.- విద్యార్థుల భవిష్యత్తు అంధకారం: వాగు అడ్డు రావడంతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లలేక పలువురు విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. 

 రోగుల ప్రాణాలపై తీవ్ర ప్రభావం: గుండెపోటు, ప్రసవం వంటి అత్యవసర సమయాల్లోనూ ఆస్పత్రికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.   - రైతు కష్టం వృథా: పండించిన పంటను మార్కెట్కు తరలించక గోదావరి పరివాహక ప్రాంత రైతులు ఇళ్లల్లో దాచుకుంటారు. గోదావరి నీటిమట్టం పెరిగిన కొద్దీ  వాగు దాటించలేని పరిస్థితి. గోదావరి ఉగ్రరూపం దాల్చితే చేతికొచ్చిన పంట గోదావరి లోనే మగ్గిపోతోంది.

ప్రత్యామ్నాయం లేని 10 గ్రామాలు  

ఒకవైపు గోదావరి, మరోవైపు ఈతవాగు... మధ్యలో ఈ 10 గ్రామాలు బందీలుగా మారాయి. వర్షాకాలం వచ్చిందంటే బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. ప్రతి ఏటా వర్షాకాలం వీరికి శిక్షాకాలంగా మారుతోంది.

గ్రామస్తుల ఆవేదన  

గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు కన్నీరు పెడుతున్నారు. ‘ఎమ్మెల్యే గారు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. కానీ ఈ వానాకాలంలోనూ పనులు ప్రారంభించండి. వాగు పొంగితే 10 ఊర్లకు బంద్. పిల్లల చదువులు, రోగుల ప్రాణాలు, రైతుల కష్టం... అన్నీ వాగులో కొట్టుకుపోతున్నాయి‘ అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కటే డిమాండ్ వెంటనే వంతెన 

హామీలతో కాలయాపన చేయవద్దని, ఈతవాగుపై హైలెవెల్ వంతెనను వెంటనే నిర్మించాలని 10 గ్రామాల ప్రజలు ఏకగొంతుతో డిమాండ్ చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపితేనే ఏజెన్సీ ప్రాంతానికి నిజమైన విముక్తి లభిస్తుందని అంటున్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. లేని పక్షంలో 10 ఊర్ల ప్రజలు ఏకమై ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.