కళాకారులు సంస్కృతికి ప్రతీకలు
బ్యాండ్, వాయిద్య కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు
బ్యాండ్, వాయిద్య కళాకారుల సమస్యలను పరిష్కరించాలి
మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): డప్పు, బ్యాండ్ వాయిద్య కళాకారులు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు అని రాష్ట్ర ఆప్కారి, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బ్యాండ్, వాయిద్య కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన కళాకారులకు పెన్షన్ కల్పించే అంశాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఈ మేరకు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవా రం నిర్వహించిన తెలంగాణ బ్యాండ్, వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి నాగరాజు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పండుగలు, జాతరలు, వివాహాలు, సామాజిక ఉద్యమాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో వాయిద్య కళాకారుల పాత్ర విశిష్టమని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో బ్యాండ్ కళాకారులు కీలక పాత్ర పోషించారని చెప్పారు.
సమాజంలో చైతన్యం పెంపొందించేందుకు చేపట్టనున్న ‘ప్రభాత భేరి’ కార్యక్రమంలో బ్యాండ్, వాయిద్య కళాకారులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బ్యాండ్ వాయిద్య కళాకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గాలకు చెందిన కళాకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్ పర్సన్ విమలక్క హాజరై ప్రసంగించారు. పలు జిల్లాల నుంచి వచ్చిన బ్యాండ్, వాయిద్య కళాకారులు, సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.






